
- భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ కొనుగోలు కేంద్రం వద్ద అన్నదాతల ఆక్రందన
- గురువారం రాత్రి 6.6 సెంటీమీటర్ల వాన, ఒక్కరోజులో తలకిందులైన రైతుల బతుకులు
- రూ.2 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతుల బతుకులను ఆగం చేసింది. గురువారం రాత్రి 6.6 సెం.మీ వర్షం కురవగా, వరద పోటెత్తింది. ఎర్ర చెరువు దగ్గర ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ముంచెత్తింది. తెల్లారగానే వరదకు కొట్టుకుపోయిన వడ్లను చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. వడ్ల పైసలొస్తే బాకీలు తీర్చుదామనుకుంటే ఇంతలోనే జాలిలేని వానలకు తమ బతుకులు ఆగమయ్యాయని రోదించారు. కొట్టుకుపోయిన వడ్లకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. తడిసిన వడ్లు మొలకెత్తక ముందే బస్తాల్లో నింపి రైస్ మిల్లులకు పంపించాలని వేడుకుంటున్నారు. రూ.2 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు.
50 శాతం వడ్లు కొట్టుకుపోయినయ్..
భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో చెరువు సమీపంలో పొలాల మధ్య కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వరి కోతలు కాగానే, రైతులు నేరుగా ట్రాక్టర్లలో వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు. 180 మంది రైతులకు చెందిన రూ.3 కోట్ల విలువ చేసే 1,300 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాయి. వడ్లలో తేమ శాతం తగ్గడానికి పొద్దంతా ఎండకు ఆరబెట్టి, రాత్రి కుప్పగా పోసి వడ్లు తడవకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పి ఇంటికి పోతున్నారు. అయితే గురువారం రాత్రి మహాదేవ్‌పూర్‌లో గాలిదుమారంతో అకాల వర్షం పడింది.
3 గంటల పాటు ఏకధాటిగా వాన పడింది. రాత్రికి రాత్రే 6.6 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో వడ్ల కొనుగోలు కేంద్రం చెరువుగా మారింది. కొనుగోలు కేంద్రం పక్కనే ఎర్ర చెరువు ఉండడంతో అటు వైపు వెళ్లే వరద అంతా వడ్ల కుప్పల పై నుంచే పోయింది. దీంతో అడ్డుగా ఉన్న వడ్లు అన్నీ తడిసి వరదకు కొట్టుకుపోయాయి. దీంతో వరద ప్లేస్‌లో ఉన్న 70 మంది రైతుల వడ్లు 70 శాతం మట్టిలో కలిసి పోతే, ఇతర రైతుల 50 శాతానికి పైగా వడ్లు కొట్టుకుపోయాయి. మిగిలిన వడ్లు అన్నీ వరద నీటిలో తడిసిపోయాయి.
ఉదయం వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లిన రైతులు మట్టిలో కలిసిన వడ్లను చూసి గుండెలవిసేలా రోదించారు. నీటిలో మునిగి ఉన్న వడ్లను కాపాడుకోవడానికి, వరద నీటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. చేతులు, పారలతో కాల్వలు తీసి వరదను వేరే వైపుగా మళ్లించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, నీట మునిగిన వడ్లను పరిశీలించారు. నష్టపోయిన రైతులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తడిసిన వడ్లు మొలకెత్తక ముందే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించినట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. వరదలో కొట్టుకుపోయిన, మట్టిలో కలిసిపోయిన వడ్లకు పరిహారం ఇప్పించేందుకు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని మహబూబాబాద్, బయ్యారం, కొత్తగూడ, కురవి, గార్ల, గూడూరు, కొత్తగూడ, మరిపెడ మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. గూడూరు కొనుగోలు సెంటర్లో వర్షం నీరు చేరడంతో వడ్లు కొట్టుకుపోయాయి. మరిపెడ మండలం వీరారంలో వడ్ల కుప్పలతో పాటు తూకం వేసిన బస్తాలన్నీ తడిసిపోయాయి. కుప్పులుగా పోసుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దగా మారాయి. కోత దశకు చేరుకున్న మామిడి కాయలు నేల రాలిపోయాయి. భారీ వర్షం, ఈదురు గాలులతో 351 స్తంభాలు విరిగిపోయాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో రూ.55లక్షల నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.