యూట్యూబ్ నుంచి వెండితెర వరకు... భువన్ అవ్నీంద్ర శంకర్ బామ్ సక్సెస్ స్టోరీ

యూట్యూబ్ నుంచి వెండితెర వరకు... భువన్ అవ్నీంద్ర శంకర్ బామ్ సక్సెస్ స్టోరీ

ఒకప్పుడు చేతిలో పెద్ద కెమెరా లేదు.. సినిమా చాన్స్ లేదు.. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ కూడా లేడు. ఉన్నదల్లా ఒక ఫోన్.. కాస్త క్రియేటివిటీ.. ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల. ఆ ఫోన్ కెమెరాతో వీడియోలు తీస్తూ మొదలుపెట్టిన ఓ కుర్రాడు.. ఇప్పుడు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్. అతడే భువన్ బామ్. యూట్యూబ్‌లో ‘బీబీ కి వైన్స్’తో పాపులర్ అయిన భువన్.. అక్కడితో ఆగలేదు. నటుడిగా, రచయితగా, సింగర్‌గా, నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

భువన్ అవ్నీంద్ర శంకర్ బామ్ గుజరాత్‌‌లోని వడోదరలో పుట్టాడు. తర్వాత కుటుంబం ఢిల్లీలో స్థిరపడటంతో అక్కడే పెరిగాడు. ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ చదువుకున్నాడు. చదువుకుంటూనే సంగీతం, కామెడీ, పర్ఫార్మెన్స్‌‌పై ఆసక్తి పెంచుకున్నాడు. భువన్ ప్రయాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఇదే. సినిమా అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడలేదు. తనకు నచ్చిన కథను తానే రాసుకున్నాడు. తానే నటించాడు. యూట్యూబ్​ ద్వారా తనకు నచ్చిన కంటెంట్‌‌ను తానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అవకాశం రాకపోతే.. మరో దారి వెతకాలి అన్నట్టుగా కాకుండా.. ‘దారి లేకపోతే మనమే చేసుకుందాం’ అన్నట్టుగా ముందుకెళ్లాడు.

కామెడీలో కాదు.. సింగింగ్​లోనూ కింగ్!

సంగీతంపై ఉన్న ఇష్టంతో రెస్టారెంట్లలో సింగర్‌‌గా కూడా పనిచేశాడు. స్టేజ్‌‌పై పాటలు పాడుతూ.. తనలోని పర్ఫార్మర్‌‌కు మరింత పదును పెట్టుకున్నాడు. యూట్యూబ్ కామెడీతో పేరు తెచ్చుకున్నప్పటికీ సింగర్‌‌గా తన గుర్తింపును కూడా నిలబెట్టుకున్నాడు. ‘తేరీ మేరీ కహానీ’, ‘సఫర్’, ‘సంగ్ హూన్ తేరే’, ‘రహ్‌‌గుజార్’ వంటి పాటలతో మ్యూజిక్ లవర్స్‌‌కు దగ్గరయ్యాడు. అంటే కెమెరా ముందు నవ్వించడమే కాదు.. పాటతో భావోద్వేగాన్ని కూడా పండించగలడని నిరూపించాడు.

నటుడిగా కొత్త ఇన్నింగ్స్..

భువన్ ప్రతిభకు ఇండస్ట్రీ నుంచి కూడా గుర్తింపు వచ్చింది. దివ్య దత్తాతో కలిసి నటించిన ‘ప్లస్ మైనస్’ షార్ట్ ఫిల్మ్‌‌కు ఫిల్మ్‌‌ఫేర్ అవార్డు దక్కింది. ఇది భువన్ కెరీర్‌‌లో మరో టర్నింగ్ పాయింట్. ‘యూట్యూబర్’ అనే ట్యాగ్ దాటి.. నటుడిగా కూడా తనలో విషయం ఉందని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఓటీటీ భువన్‌‌కు మరో పెద్ద వేదికగా మారింది. ‘డిండోరా’లో నటించడమే కాకుండా కథ, కంటెంట్ విషయంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘తాజా ఖబర్’ తో నటుడిగా తన రేంజ్‌‌ను చూపించాడు. కామెడీ వీడియోల్లో చూసిన భువన్‌‌కు భిన్నమైన నటుడిని ప్రేక్షకులు అక్కడ చూశారు. ఎమోషన్, సీరియస్ సీన్లు, డ్రామా.. ఇలా తనలో మరో యాంగిల్ ఉందని చూపించాడు. ‘రాఫ్తా రాఫ్తా’ తోనూ ప్రేక్షకులను పలకరించాడు.

ఊహించని కష్టం..

కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే భువన్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం ఎదురైంది. 2021లో కొవిడ్ సమయంలో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంట్లోనే షూటింగ్ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించిందని భువన్ చెప్పాడు. అలాంటి పరిస్థితుల మధ్య కూడా తన పనిని కొనసాగించాడు. వ్యక్తిగత బాధను దాచుకుని కెమెరా ముందు నవ్వించడం ఎంత కష్టమో అతని ప్రయాణం చెప్తుంది.

ఇప్పుడు టార్గెట్ పెద్దదే!

యూట్యూబ్‌‌లో కామెడీ చేసిన కుర్రాడు ఇప్పుడు చారిత్రక పాత్రలు చేసే స్థాయికి వచ్చాడు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది  రివల్యూషనరీస్’లో స్వాతంత్ర్య సమరయోధుడు రాష్ బిహారీ బోస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది భువన్‌‌కు మరో కొత్త పరీక్ష. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసింది ఒక రకమైన భువన్. ఇక చారిత్రక పాత్రలో కనిపించబోయే భువన్ ఎలా ఉంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఒక్కడే.. ఇన్ని పాత్రలా?

భువన్ బామ్‌కు అసలు గుర్తింపు తెచ్చింది అతని పాత్రలే. ఒక వీడియోలో ఒక పాత్ర.. మరో వీడియోలో మరో పాత్ర. తనే రకరకాల గెటప్‌లు, వాయిస్‌లు, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ ప్రేక్షకులను నవ్వించాడు. బంచోదాస్, టిటూ మామా, సమీర్ ఫుద్దీ, బబ్లూ లాంటి పాత్రలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే మనుషుల్ని, వాళ్ల మాట తీరును, రోజువారీ పరిస్థితులను కామెడీగా చూపించడం భువన్‌కు బాగా కలిసొచ్చింది. అతని కామెడీలో పెద్దగా ఆర్భాటం ఉండదు. మన ఇంట్లో.. మన పక్కింట్లో.. మన ఫ్రెండ్స్ మధ్య కనిపించే సీన్లే ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు ‘అరే.. ఇది మన కథే కదా!’ అనిపించేది.

ఓ వీడియో.. జీవితాన్నే మార్చేసింది!

2015లో భువన్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. ‘మనమే పాత్రలు చేసుకుంటే? మనమే కథ రాసుకుంటే?’ అని. అలా మొదలైంది ‘బీబీ కి వైన్స్’. ప్రత్యేకంగా స్టూడియో లేదు. భారీ సెటప్ లేదు. పెద్ద టీమ్ లేదు. తనే కథ రాసేవాడు.. తనే షూట్ చేసేవాడు.. తనే ఎడిట్ చేసేవాడు.. చివరికి తనే రకరకాల పాత్రల్లో నటించేవాడు. మొదట్లో చాలామంది దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తే కెరీర్ ఎలా వస్తుందని అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ భువన్ మాత్రం ఆగలేదు.