అమ్ముడుపోని ఎమ్మెల్యేలను వేధిస్తారా?.. మీ సంగతి చూస్తం

అమ్ముడుపోని ఎమ్మెల్యేలను వేధిస్తారా?.. మీ సంగతి చూస్తం

నల్గొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆపాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని.. దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు.  పేదలకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తూ ఆదుకుంటున్న రాజగోపాల్ రెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా ఎలా అడ్డుకుంటారంటూ సీరియస్ అయ్యారు. తెలంగాణలో అమ్ముడుపోని ఎమ్మెల్యే లను ఈ విధంగా వేధించడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. స్థానిక ఎంపీనైన తనను కూడా సర్కారు కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు. 

‘మంత్రి జగదీష్ రెడ్డి ఆయన సొంత ఆస్తులు ఏమైనా పంచుతున్నాడా? 90 శాతం పూర్తయిన బ్రాహ్మణవెల్లంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను 8 ఏళ్ల నుంచి పూర్తి చేయలేదు. జగదీశ్ రెడ్డి  చేతగాని మంత్రి. జిల్లాకు శనిలా పట్టుకున్నడు. డబ్బు సంపాదించడానికే పరిమితమయ్యిండు. నీ సంగతి చూస్తం. మీ అవినీతిపై  ప్రజా ఉద్యమం నిర్వహిస్తం. అరెస్ట్ చేసిన మా పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయకపోతే జిల్లాలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా అడ్డుకుంటాం’ అని వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.