
- ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని భువనగిరి మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం
- స్టేట్, ఢిల్లీ లెవల్లో ప్రయత్నించాలంటున్న ఎక్స్పర్ట్స్
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్లందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. చివరిదశకు వచ్చిన తర్వాత చేసిన తీర్మానంతో ఎంత వరకూ ఉపయోగమన్నది చర్చనీయాంశమైంది. యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) వెళ్లనుంది. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1,853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే రీజినల్ రింగ్ రోడ్డును యాదాద్రి జిల్లా బాధితులు ప్రధానంగా భువనగిరి మున్సిపాలిటీలోని రాయగిరి ప్రజలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాధితులు నిరంతరం ఆందోళనలు చేస్తున్నా.. ట్రిపుల్ఆర్కు సంబంధించి సర్వే పూర్తి కావడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నుంచి మద్దతు వస్తున్నా అధికార బీఆర్ఎస్ నుంచి సహకారం కరువైందని, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలుమార్లు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పైగా మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ఈ ఒత్తిడితో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మున్సిపాలిటీలో తీర్మానం చేయిస్తానని ఈమధ్య ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రత్యేకంగా కౌన్సిల్.. తీర్మానం
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన కౌన్సిల్ గురువారం ప్రత్యేకంగా సమావేశమైంది. నేషనల్ హైవే, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, హై టెన్షన్ స్తంభాల ఏర్పాటు సహా యాదగిరి గుట్ట రోడ్డు విస్తరణ కోసం రాయగిరి రైతులు గతంలో భూములు ఇచ్చారని కౌన్సిల్లో మెంబర్లు చర్చించారు. పలుమార్లు భూములు కోల్పోయిన వీరి భూములే.. మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అలైన్‌మెంట్‌ను రాయగిరి మీదుగా కాకుండా వేరే ప్రాంతం నుంచి మార్చాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
నేషనల్ హైవే ఆఫీసర్లను ఒప్పిస్తే..
ట్రిపుల్ ఆర్ భూసేకరణ అంశం చివరిదశకు వచ్చింది. రైతుల అభిప్రాయాలను నేషనల్ హైవే ఆఫీసర్లు తోసిపుచ్చారు. భువనగిరి మినహా మిగిలిన చోట్ల ఫైనల్ గెజిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పేర్కొన్న అలైన్మెంట్ ఫైనల్ అన్న స్టేజికి వచ్చేసింది. అలైన్మెంట్ ప్రపోజల్ వచ్చిన టైంలోనే.. జిల్లాలోని అన్ని చోట్ల తీర్మానం చేయడంతోపాటు స్టేట్ లెవల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ లీడర్లు నేషనల్ హైవే ఆఫీసర్లను కన్విన్స్ చేసి ఉంటే.. కొంత ప్రయోజనం ఉండేదని అంటున్నారు. అదే విధంగా లీగల్‌గానూ బాధితులకు సాయంగా నిలబడితే ప్రయోజనం ఉండేదంటున్నారు. ఇప్పటికీ స్టేట్, ఢిల్లీ లెవల్లో ప్రయత్నించి నేషనల్ హైవే ఆఫీసర్లను ఒప్పించాలని, ఇవేమీ చేయకుండా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే లాభంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.