గాజా ఆస్పత్రిపై దాడి మేం చేయలే .. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన

గాజా ఆస్పత్రిపై దాడి మేం చేయలే .. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన
  • టెర్రరిస్ట్​ల రాకెట్ మిస్ ఫైర్.. అదే ఆస్పత్రిపై పడిందని వెల్లడి
  • వీడియో, ఆడియో డేటా విడుదల

అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్ బుధవారం ఇజ్రాయెల్​లో పర్యటించారు. ఎయిర్ పోర్ట్ లో తనకు స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్​వైపే అమెరికా నిలబడుతుందని బైడెన్ చెప్పారు. తనకు తెలిసిన సమాచారం మేరకు గాజా ఆస్పత్రిపై దాడి ఇజ్రాయెల్ ఆర్మీ చేయలేదని,  ఆ అటాక్ వేరే టీమ్ చేసిందని చెప్పారు. కాగా, హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య నలిగిపోతున్న గాజా ప్రజలను ఆదుకోవడానికి 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని బైడెన్ ప్రకటించారు.

గాజా/టెల్ అవీవ్/జెరూసలెం: గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్​పై మంగళవారం రాత్రి జరిగిన రాకెట్ దాడితో తమకు సంబంధంలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్పష్టం చేసింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అనే టెర్రరిస్ట్ సంస్థ ప్రయోగించిన రాకెట్ మిస్ ఫైర్ అయి దవాఖాన పేలిపోయిందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న వీడియో, ఆడియో, ఇంటెలిజెన్స్ డేటాను బుధవారం ఐడీఎఫ్ విడుదల చేసింది.  

అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ఆర్మీ రాకెట్ దాడి చేసిందంటూ హమాస్ చేసిన ప్రకటనను ఐడీఎఫ్ ఖండించింది. ఆస్పత్రి పేలిన ఘటనకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. అందులో రాత్రిపూట ప్రయోగించిన ఓ రాకెట్ గాలిలోనే మండిపోవడం, ఆ వెంటనే నేలపై రెండు భారీ పేలుళ్లు సంభవించడం కనిపించింది. దాడి జరిగిన వెంటనే ఇద్దరు హమాస్ మిలిటెంట్లు మాట్లాడుకున్నట్లుగా చెప్తున్న ఆడియో టేప్​ను కూడా ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగేరీ మీడియాకు విడుదల చేశారు. ‘‘ఆ రాకెట్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వాళ్లు ప్రయోగించారని అంటున్నారు. 

అది మనదేనా?” అని ఓ వ్యక్తి అడిగితే.. ఇంకో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘అలాగే కనిపిస్తోంది. అది మిస్ ఫైర్ అయి వాళ్లపై పడిపోయింది” అంటున్నట్లుగా ఆడియోలో వినిపించింది. అలాగే, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ అయి ఉంటే భారీ గొయ్యి ఏర్పడి ఉండేదని, చుట్టూ బిల్డింగ్​లకూ నష్టం జరిగి ఉండేదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన తీరుపై రూపొందించిన మ్యాపులనూ ఐడీఎఫ్ విడుదల చేసింది. 

ఆస్పత్రిపై దాడి ఇజ్రాయెల్ పనికాదు: బైడెన్ 

గాజాలోని ఆస్పత్రిపై దాడి ఇజ్రాయెల్ ఆర్మీ చేసినట్లుగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్​కు అమెరికా అండగా ఉంటుందని మరోసారి ప్రకటించారు. బుధవారం ఇజ్రాయెల్​లోని టెల్​అవీవ్ నగరానికి వచ్చిన ఆయన ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసిన సమాచారం మేరకు గాజా ఆస్పత్రిపై దాడి ఇజ్రాయెల్ ఆర్మీ చేయలేదు. ఆ అటాక్ వేరే టీమ్ చేసినట్లుగా తెలుస్తోంది” అని బైడెన్ చెప్పారు. అయితే, ఆస్పత్రిపై దాడి ఘటన తీవ్ర విచారకరమని నెతన్యాహుకు చెప్పానన్నారు. ఈ సందర్భంగా గాజా, వెస్ట్ బ్యాంక్ కు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని బైడెన్ ప్రకటించారు. కాగా, గాజా ఆస్పత్రిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన జోర్డాన్ పర్యటన రద్దయింది.

దాడులు ఆపేస్తే.. బందీలను విడిచిపెడ్తం: హమాస్ 

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులను ఆపేస్తే తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికారు ఒకరు ప్రకటించారు. బాంబు దాడులు ఆగిన గంటలోపే బందీలందరినీ వదిలిపెడతామని చెప్పినట్లు యూఎస్ మీడియా సంస్థ ‘ఎన్బీసీ న్యూస్’ వెల్లడించింది.

దాడి చేసినోళ్లు బాధ్యత వహించాల్సిందే: మోదీ 

న్యూఢిల్లీ: గాజాలోని ఆస్పత్రిపై మిసైల్ దాడి, వంద లాది మంది ప్రజల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

మృతుల లెక్కపై అయోమయం

గాజా ఆస్పత్రిపై దాడి ఘటనలో మృతుల సంఖ్యపై అయోమయం నెలకొంది. మొత్తం 500మంది చనిపోయారని ప్రకటించిన గాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ఆ సంఖ్యను 471 కి సవరించింది. అయితే, మృతుల సంఖ్య 250 వరకూ ఉంటుందని అల్ అహ్లీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక యుద్ధంలో ఇప్పటివరకూ 3,478 మంది పాలస్తీనియన్లు చనిపోయారనిగాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోయారని ఐడీఎఫ్ ​వెల్లడించింది.