మీరు రియల్​ హీరోస్​.. మీ వల్లే చాలా మంది ప్రాణాలు దక్కాయ్​ : బైడెన్

మీరు రియల్​ హీరోస్​.. మీ వల్లే చాలా మంది ప్రాణాలు దక్కాయ్​ : బైడెన్
  •  డాలీ నౌకలోని భారతీయ సిబ్బందిపై బైడెన్​ ప్రశంస

వాషింగ్టన్​: ‘మీరు నిజమైన హీరోలు.. మీ అప్రమత్తత వల్లే చాలా మంది ప్రాణాలు దక్కాయ్’​ అని  వంతెనను ఢీకొన్న డాలీ నౌకలోని భారత సిబ్బందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రశంసించారు. మంగళవారం ఉదయం వాణిజ్య నౌక ఢీకొట్టడంతో బాల్టిమోర్​లోని పటాప్​ స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్​ స్కాట్​ కీ వంతెన పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనపై బైడెన్ బుధవారం స్పందించారు.

 షిప్​లోని సహాయక సిబ్బందితోపాటు 22 మంది భారత సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘నౌక నియంత్రణ కోల్పోగానే సిబ్బంది అప్రమత్తమయ్యారు. మేరీలాండ్​ డిపార్ట్​మెంట్ ఆఫ్​ ట్రాన్స్​పోర్టేషన్​కు సమాచారం అందించారు. దీంతో స్థానిక​అధికారులు బ్రిడ్జిపైకి ఎవరూ రాకుండా ట్రాఫిక్​ను నిలిపేశారు. చాలామంది ప్రాణాలు కాపాడగలిగారు’ అని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి బైడెన్​ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే వంతెన పునర్నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. 

ఇది అతి భయానక ఘటన అని, దీని వెనుక వేరే దేశాల ప్రమేయం ఉన్నట్టు తాము అనుమానించడం లేదని అన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన నౌక గ్రేస్​ ఓసియన్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీకి చెందినదని అధికారులు పేర్కొన్నారు. బాల్టిమోర్​నుంచి కొలంబోకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఈ షిప్​లోని 22 మంది సిబ్బంది భారతీయులేనని, అందరూ సేఫ్​ గానే ఉన్నారని షిప్​ మేనేజ్​మెంట్​ కంపెనీ సినర్జీ మెరైన్​ గ్రూప్​ వెల్లడించింది.  

గల్లంతైన ఆరుగురు మృతి!

నౌక బ్రిడ్జిని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు అధికారులు భావిస్తున్నారు. డాలీ నౌక ఇంజిన్​ పవర్, ఎలక్ట్రిక్​ పవర్​ పూర్తిగా జీరో కావడంతోనే కంట్రోల్​ తప్పి బ్రిడ్జిని ఢీకొట్టినట్టు తెలిపారు. ఈ సమయంలో బ్రిడ్జిపై ఉన్న ఆరుగురు రిపేయిర్​ మెన్స్​ నదిలో పడిపోయారని, వెంటనే సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారని వెల్లడించారు.