విభజన అంశాలు రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి

విభజన అంశాలు రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
  • ఏపీ, తెలంగాణకు  స్పష్టం చేసిన కేంద్రం   

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికీ పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ సూచించారు. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఇప్పటికే చర్చలు  జరిపిందని చెప్పారు. మంగళవారం లోక్ సభలో క్వశ్చన్ అవర్ లో ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మిథున్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను లేవనెత్తారు. వీటిపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏపీ, తెలంగాణల మధ్య దాదాపు 32 అంశాలపై ఏకాభిప్రాయం లేదన్నారు. అంశాల పరిష్కారంపై తెలంగాణ అభిప్రాయం కోరినా స్పందించలేదని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి గొడవలు లేవని నామా అన్నారు.