తెలుగు బిగ్బాస్: హౌస్ అంతా ఇనయానే హాట్ టాపిక్

తెలుగు బిగ్బాస్: హౌస్ అంతా ఇనయానే హాట్ టాపిక్

నామినేషన్ రౌండ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు చాలామంది ఉత్సుకతతో ఉన్నారు. మరి వారిలో ఎవరు కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారు? అసలు బిగ్‌బాస్ వాళ్లకి ఈసారి ఏ టాస్క్ ఇచ్చాడు?

ఇంటి నిండా ఇనయానే!

నామినేషన్ ప్రక్రియ సమయంలో దాదాపు అందరూ ఇనయాని నామినేట్ చేశారు. అందరి దగ్గరా వ్యాలీడ్ రీజన్స్ ఉన్నాయి. అయితే తనని తాను డిఫెండ్ చేసుకునే సమయంలో ఇనయా ప్రవర్తించిన తీరు ఎవరికీ రుచించలేదు. దాంతో ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఆమె గురించే చర్చ నడిచింది. శ్రీహాన్ అయితే ఒంటరిగా పడుకుని మరీ ఆమె గురించి తనలో తనే మాట్లాడుకున్నాడు. నేనన్నది ఒకటైతే ఈమె నానార్థాలూ ప్రతిపదార్థాలూ తీస్తోంది, నా ఏజ్ తక్కువని నేను చెప్పుకుంటే నా ఏజ్ ఎక్కువని బాడీ షేమింగ్‌ చేస్తున్నావా అంటుంది, ఈమె యాక్టింగ్‌కి ఆస్కార్ కూడా తక్కువే అంటూ గొణుక్కున్నాడు శ్రీహాన్. నిన్న కూడా కెమెరాని చక్కగా ఫేస్ చేసి పడుకుని ఇదే తరహాలో మాట్లాడాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. శ్రీహాన్ నిజంగానే రెండుసార్లు ఇన్‌డైరెక్ట్ ఇనయాని అన్నాడు. ఒకసారి పిట్ట అని, మరోసారి తన ఏజ్ తక్కువని. తెలివిగా కవరైతే చేసుకుంటున్నాడు కానీ అన్నది ఆమెనే అనేది క్లియర్. అయితే ఇనయా రియాక్షన్స్ లిమిట్స్ దాటడమనేది ఇరిటేటింగ్‌గా అనిపిస్తోంది. మరోవైపు ఇనయాని నామినేట్ చేసిన రోహిత్, మెరీనాలు వెళ్లి ఆమెకి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మీరు మానిప్యులేట్ చేయడం వల్లే నేను వెళ్లాను, అలాంటిది మీరెలా నన్ను నామినేట్ చేస్తారు, అందరూ చేసినా నేను బాధపడలేదు కానీ మీరు చేయడం బాధనిపించింది అంది ఇనయా. అందరం కలిసి ఆడినప్పుడు తననొక్కదాన్నే బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదంటూ ఫైమా కూడా చురకలేసింది. రోహిత్, మెరీనా అస్సలు ఆలోచించకుండా ఆట ఆడతారనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. ఆ టైమ్‌కి ఏదనిపిస్తే అది చేసేస్తారు తప్ప వాళ్లకంటూ ఓ స్ట్రాటజీ లేకపోవడం కచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్లకి బ్యాడ్ అవ్వడం ఖాయం. ఇక ఆదిరెడ్డి తన అలవాటు ప్రకారం రివ్యూ ఇచ్చాడు. ఈవారం చాలామంది నామినేట్ అయ్యారు కనుక ఎలిమినేషన్ టఫ్‌గా ఉంటుందన్నాడు. రేవంత్, గీతూ, సూర్య, శ్రీహాన్ తప్ప ఎవరైనా వెళ్లిపోతారన్నాడు. అయితే ఇనయా కూడా వెళ్లదని తర్వాత జోస్యం చెప్పాడు. నాకు భయంగా ఉంది అని రేవంత్ అంటే.. నువ్వు పర్‌‌ఫార్మ్ చేస్తావు కదా, నీకెందుకు భయం అంటూ ధైర్యం చెప్పాడు. ఏదేమైనా ఇప్పుడు హౌస్ అంతా ఇనయానే హాట్ టాపిక్.

ఆరోహి అస్సలు తగ్గట్లా!

నాగార్జున ముఖమ్మీదే సెటైర్లు వేస్తున్నారు. ఆడియెన్స్ కూడా పదే పదే కామెంట్ చేస్తున్నారు. అయినా కూడా ఆరోహి బిహేవియర్ మారడం లేదు. సూర్య విషయంలో ఆమె కొద్దిగా గీత దాటుతున్నట్టే కనిపిస్తోంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే వీళ్లిద్దరూ ఓ మూలకు పోయి ముచ్చట్లు పెట్టారు. సూర్య వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం తనకి నచ్చట్లేదంటూ తెగ ఫీలైపోయింది ఆరోహి. నువ్వూ వేరేవాళ్లతో క్లోజ్‌గా ఉంటున్నావ్, అయినా నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేనేమీ అనడం లేదంటూ సూర్య పెద్దరికం ప్రదర్శించాడు. అతను చెప్పే వివరణ నచ్చక ఆరోహి అలిగి వెళ్లిపోయింది. దాంతో గేమ్‌ మీద ఫోకస్ పెట్టాలని, లైఫ్‌లో  ఇలాంటి రిలేషన్లు శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ బిగ్‌బాస్ హౌస్‌లో నేను వేసే మార్క్ హిస్టరీగా ఉండిపోతుందని, ఈ జర్నీని గుర్తుండిపోయేలా మలచుకోవాలని తనను తాను మోటివేట్ చేసుకున్నాడు సూర్య. ఇదంతా కాస్త ఆర్టిఫీషియల్‌గాను, కావాలని చెప్పినట్టుగాను ఉందనడంలో సందేహమే లేదు. ఇక కాసేపటికి మళ్లీ అతని పక్కన చేరింది ఆరోహి. దాంతో మనోడు మళ్లీ వివరణ మొదలెట్టాడు. నేను మరో నలుగురైదుగురికి తినిపించినా నీకు తినిపించేటప్పుడు ఆ ఎఫెక్షన్ వేరేలా ఉంటుంది, నువ్వేమో నిన్ను తప్ప ఎవరినీ నమ్మను అని వేరేవాళ్లతో చెప్పావ్, నీకూ నాకూ అదే తేడా అంటూ క్లాస్ పీకాడు. సరే అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక వదిలెయ్ అంది ఆరోహి. అప్పుడామె పెదాలతో ఇచ్చిన ఒక సిగ్నల్ కెమెరాల్ని, ప్రేక్షకుల కళ్లనీ దాటిపోలేదు. ఆమె ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు ఇలాంటి సైగలు చేసుకుంటూ కనిపించారిద్దరూ. ఇలాంటివి మొదట్లో మామూలుగా అనిపించినా పదే పదే జరిగితే ప్రేక్షకులు ఎంత ఇరిటేట్ అవుతారో గత సీజన్లో చూశాం. ఆ విషయం గుర్తు పెట్టుకుని వీళ్లిద్దరూ కాస్త జాగ్రత్తపడితే మంచిదేమో.

మళ్లీ అదే నస

ప్రతి సీజన్‌లో రకరకాల టాస్కులు పెడుతుంటారు. అయితే ప్రతిసారీ కామన్‌గా ఉండేది.. హోటల్‌ టాస్క్. ఏవో చిన్నపాటి మార్పులు తప్ప ఎప్పుడూ ఒకేలా ఉంటుందీ ఆట. ఈసారి గేమ్ ఏంటంటే.. బిగ్‌బాస్ హోటల్లో కొందరు పని చేస్తుంటారు. పక్కనే ఆడపిల్లలు పెట్టిన గ్లామ్ ప్యారడైజ్ అనే హోటల్లో కొందరు ఉంటారు. ఒకదానికి మేనేజర్ సుదీప. మరోదానికి మేనేజర్ ఫైమా. రిచ్‌ గాళ్‌ ఇనయా, గతం మర్చిపోయి ప్రతిసారీ కొత్తగా ప్రవర్తించే సూర్య, తమ ఫ్రెండ్ పెళ్లికి లొకేషన్ ఫిక్స్ చేయడానికి వచ్చిన రాజ్, అర్జున్, ఒకే ఒక్క హిట్టు సినిమా చేసి సూపర్‌‌ స్టార్‌‌లా ఫీలైపోయే ఫిల్మ్ స్టార్ శ్రీహాన్‌ కస్టమర్లుగా వస్తారు. వీళ్లని ఈ రెండు హోటళ్లవారూ ఆకర్షించి డబ్బు గుంజాలి. ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు, ఎక్కువమంది కస్టమర్లు ఉంటారో ఆ హోటల్‌ వాళ్లే విజేతలు. వాళ్లు కెప్టెన్సీ పోటీకి అర్హత సంపాదిస్తారు. ఈ గేమ్‌లో చిన్న ట్విస్ట్ ఏంటంటే సీక్రెట్ టాస్క్. అది చంటికి ఇచ్చాడు బిగ్‌బాస్. పక్క హోటల్లో ఉన్న కస్టమర్లందరినీ కనుక కన్విన్స్ చేసి బిగ్‌బాస్ హోటల్‌కి తీసుకు రాగలిగితే అతనికి కూడా కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అయితే అతను ఎప్పటిలాగే కాస్త తక్కువ ఎఫర్ట్ పెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇక ఫైమా మేనేజర్‌‌లా కాక హౌస్ కీపింగ్ మెంబర్‌‌లా బిహేవ్ చేస్తోంది. ఆమె హావహావాలు కాస్త అతిగా అనిపిస్తున్నాయి. శ్రీసత్య కాస్త తెలివిగా గేమ్ ఆడటానికి ట్రై చేస్తోంది. దాన్ని అర్జున్ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఆమె ఇచ్చిన ఆఫర్లకి ఒప్పుకునే క్రమంలో తనకు నచ్చినవన్నీ చేయించుకుంటున్నాడు. భుజమ్మీద చేయి వేసి ఫొటో తీయించుకోవడం, తనకి అన్నం తినిపించడం లాంటి కండిషన్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సూర్యకి మసాజ్ చేయమని చెప్పడంతో ఆరోహి సిగ్గులు ఒలకబోస్తూనే తన పని కానిచ్చింది.

ఈ మూడు వారాల్లో టెలికాస్ట్ అయిన అత్యంత బోరింగ్ ఎపిసోడ్లలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సీజన్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ మిస్సయిందని, షో రేటింగ్ బాగా పడిపోయిందని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడైనా కాస్త కొత్త ఫార్మాట్ క్రియేట్ చేసి, క్రియేటివ్ టాస్కులు పెడితే ఫలితం ఉంటుంది కదా. అది మానేసి.. ఇప్పటికే ప్రతి సీజన్‌లో చూసి చూసి విసిగిపోయి ఉన్న ఇలాంటి బోరింగ్ గేమ్స్ పెడుతున్నారు. దాన్ని కంటెస్టెంట్లు మరింత బోరింగ్‌గా మార్చేస్తున్నారు. రేపు ఏదో కాస్త గొడవ పడుతున్నట్టు ప్రోమోలో కనిపించింది. అయితే ఎంటర్‌‌టైన్‌మెంట్ అంటే గొడవలు పడటం కాదు కదా.. వినోదాన్ని అందించడం. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో బిగ్‌బాస్!