
- కావూరి హిల్స్లో మురుగు సమస్యకు చెక్!
- క్షేత్రస్థాయిలో పర్యటించిన వాటర్ బోర్డు ఎండీ
- శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: దుర్గం చెరువు సమీపంలోని కావూరి హిల్స్ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారానికి మెట్రో వాటర్ బోర్డు చర్యలు చేపట్టింది. వర్షాల వల్ల సీవరేజ్ ఓవర్‌ఫ్లో అవుతుండటంతో బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, అధికారులతో చర్చించారు. సీవరేజ్ లైన్లను డి-సిల్టింగ్ చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ వద్ద సీవరేజ్ అనుసంధానం, వర్షపు నీటి కాల్వలో మురుగు చేరకుండా చర్యలు, స్లూయిస్ వాల్వ్‌ల పర్యవేక్షణకు సూచనలు ఇచ్చారు.
అలాగే దుర్గం చెరువు వద్ద ఉన్న 7 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, ఎస్టీపీ ఇన్లెట్, అవుట్లెట్లను పరిశీలించారు. స్కాడా రూమ్‌లో ఆన్‌లైన్ పర్యవేక్షణ వివరాలను తెలుసుకున్నారు. అన్ని ఎస్టీపీల పనితీరు, ఇన్‌ఫ్లో, శుద్ధి నీటి నాణ్యత వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రధాన కార్యాలయంలో డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.