వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుండి విడుదల

వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుండి విడుదల

వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. 2025 ఫిబ్రవరి 13న అరెస్టైన వల్లభనేని వంశీ.. 137 రోజుల పాటు సబ్ జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పలు స్టేషన్లలో 11 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ( జులై 1 ) నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో వంశీపై ఉన్న కేసుల్లో బెయిల్ వచ్చినట్లయ్యింది. బుధవారం ( జులై 2 ) జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీ.
 
ఇదిలా ఉండగా.. వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బుధవారం ( జులై 2 ) ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను జులై 16 కు వాయిదా వేసింది. మైనింగ్ వాల్యూయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది సుప్రీంకోర్టు.సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

మైనింగ్ కేసులో తమ వాదన వినకుండా వంశీకి బెయిల్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా. 195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని.. సీల్డ్ కవర్ లో నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపారు లూత్రా. ఈ క్రమంలో కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ కే వినోద్ చంద్రన్ ల ధర్మాసనం...  తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

మంగళవారం ( జులై 1 ) నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో తనపై నమోదైన అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయ్యింది. దీంతో కృష్ణా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ఇవాళ ( జులై 2 ) విడుదలయ్యారు. అయితే.. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆయన విడుదలను ఆపాలనుకున్న కూటమి సర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ నెల 16న సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు.