నిజామాబాద్​జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్షాక్

నిజామాబాద్​జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్షాక్
  • మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా  
  • కాంగ్రెస్​లో చేరిన బోధన్​ మున్సిపల్ ​చైర్​పర్సన్ ​పద్మ, కౌన్సిలర్లు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలో బీఆర్ఎస్​కు పెద్ద షాక్​ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, బోధన్​మున్సిపల్​ చైర్​పర్సన్​ తూము పద్మ, ఆమె భర్త శరత్​రెడ్డి, పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పారు. పద్మ, శరత్​రెడ్డి సోమవారం కాంగ్రెస్​లో చేరగా.. ఆకుల లలిత కూడా నేడో రేపో కాంగ్రెస్​లో చేరనున్నారు. తన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్​ టికెట్ లలిత ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ సిట్టింగ్​ఎమ్మెల్యే గణేశ్​గుప్తకే మళ్లీ టికెట్ ఇవ్వడంతో నారజ్​గా ఉన్న ఆమె పార్టీ వీడారు. ఆమెకు అర్బన్​ టికెట్​ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

షకీల్​ను ఓడించేందుకే..  

బోధన్​ మున్సిపల్​ చైర్​ పర్సన్​ తూము పద్మ, ఆమె భర్త, కౌన్సిలర్ శరత్​రెడ్డికి చాలాకాలంగా ఎమ్మెల్యే షకీల్​తో విబేధాలున్నాయి. బోధన్​లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వారి మధ్య వైరం మొదలైంది. ఈ వ్యవహారంలో శరత్​రెడ్డిపై పోలీసు కేసు కూడా నమోదైంది. పద్మ దంపతులు రెండుసార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారు. మళ్లీ షకీల్​కు టికెట్​ఇస్తే ఓడిస్తామని కవితకు తెగేసి చెప్పారు. అయినా టికెట్ షకీల్​కే ఇవ్వడంతో పద్మ దంపతులు బీఆర్ఎస్​వీడారు. సోమవారం హైదరాబాద్​లో పీసీసీ చీఫ్ రేవంత్​ సమక్షంలో వారు కాంగ్రెస్​లో చేరారు.