
- ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లు కాంపౌండ్స్‌లోనూ తనిఖీలు చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆర్డర్
- రంగంలోకి ఎక్సైజ్ శాఖ.. కూకట్‌పల్లిలోని కల్లు కాంపౌండ్స్‌లో శాంపిల్స్ సేకరణ
- కల్లులో అల్ర్ఫాజోలం, మత్తు ట్యాబ్లెట్లు, మురికి నీళ్లు కలిపినట్టు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: కల్తీ కల్లుతో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి కారణాలేంటో తేల్చాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లు కాంపౌండ్స్‌లోనూ తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాల్లోసోదాలు నిర్వహించి శాంపిల్స్ సేకరిస్తున్నారు. వాటిని టెస్టుల కోసం ల్యాబ్‌లకు పంపుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కల్లు కాంపౌండ్స్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు.
కల్లులో అల్ఫ్రాజోలం, మత్తు ట్యాబ్లెట్లు, చివరికి మురికి నీళ్లు కూడా కలిపినట్టు గుర్తించారు. సాధారణంగా పులియబెట్టిన కల్లును గంటల్లోనే విక్రయించాల్సి ఉండగా.. ఈ మాఫియా సభ్యులు రెండు, మూడు రోజుల వరకు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. కల్లు నిల్వ ఉంచడానికి, అలాగే మత్తును మరింతగా పెంచడానికి అల్ఫ్రాజోలం, మత్తు ట్యాబ్లెట్లతో పాటు కెమికల్స్‌ను కలుపుతున్నట్టు తేలింది. ల్యాబ్ రిపోర్టులు వస్తే అసలు కల్లులో ఏమేం కలిపారనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
గత ఆరు నెలల్లో భారీగా కేసులు..
ప్రభుత్వానికి ఎక్సైజ్ఎన్ఫోర్స్మెంట్ఇచ్చిన నివేదిక ప్రకారం.. గత ఐదారు నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాల నుంచి పెద్ద ఎత్తున శాంపిల్స్ సేకరించి, వాటి నాణ్యతను పరిశీలించారు. మొత్తంగా 2,084 కల్లు శాంపిల్స్ సేకరించి పరిశీలించారు. ఇందులో 13 శాంపిల్స్‌లో కల్తీని గుర్తించి, ఆ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 503 దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కల్తీ కేసుల్లో 22 మందిని, అక్రమంగా కల్లు విక్రయిస్తున్న కేసుల్లో 371 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 42 వేల లీటర్ల కల్తీ కల్లు, అక్రమ కల్లును స్వాధీనం చేసుకున్నారు. 437.9 కిలోల (సీహెచ్), 8.97 కిలోల అల్ఫ్రాజోలం, 0.02 కిలోల డియాజెపామ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు రవాణాకు ఉపయోగించిన 24 వాహనాలను సీజ్ చేశారు.
ఆ కల్లు తాగేది పేదలే..
కల్లు కాంపౌండ్స్‌లో కల్లు తాగేవాళ్లలో అడ్డా కూలీలు, పారిశుధ్య కార్మికులు, బిచ్చగాళ్లు, కూలీనాలీ చేసుకునేవారే అధికంగా ఉంటున్నారు. కల్తీ కల్లుకు అలవాటు పడినవారు వ్యసనపరులుగా మారుతుంటారని నిపుణులు చెబుతున్నారు. తాగడం ఆపితే ఫిట్స్ రావడం, నాలుక కరుచుకుని వెకిలి చేష్టలు, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడతారని పేర్కొంటున్నారు. అందులో కలిపే కెమికల్స్ వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావడం, రోడ్డుపై స్పృహ లేకుండా పడిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో నేచురల్కల్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సింథటిక్ కల్లు తయారుచేయడం మొదలుపెట్టారు. దీంట్లో పిండి కూడా కలుపుతున్నారు. పరిశుభ్రంగా లేని ట్యాప్వాటర్కలపడం, మత్తు రావడానికి ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపామ్, అల్ఫ్రాజోలం వంటివి కలిపి పులియబెట్టి మూడు నాలుగు రోజులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. దీంతో అది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇది నాడీ వ్యవస్థ దెబ్బతీయడంతో పాటు కడుపులోని పేగులలో మంటలకు కారణమవుతుంది. లివర్ డ్యామేజ్ చేస్తుంది. కంటిచూపు మందగించడంతో పాటు గుండెపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ..
కూకట్‌పల్లిలో కల్తీ కల్లు గుట్టు రట్టు చేయడంలో ఎక్సైజ్ శాఖ ఐదు బృందాలుగా విడిపోయి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హైదర్‌నగర్, హెచ్‌ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించింది. వీటిని నారాయణగూడలోని ల్యాబ్‌కు పంపగా.. భాగ్యనగర్ మినహా మిగిలిన మూడు దుకాణాల్లో కల్తీ కల్లు తయారీ చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆబ్కారీ అధికారులు మూడు కల్లు దుకాణాల లైసెన్సులను రద్దు చేశారు.