
- కొండలు ఎక్కి దిగి కొండలు ఎక్కి దిగి
- టూరిస్టులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులు.. బైసరన్‌లో దాడి తర్వాత మళ్లీ అడవిలోకే పరార్
- దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెల్లడవుతున్న నిజాలు
- ముగ్గురు పాక్ టెర్రరిస్టులకు.. లోకల్ టెర్రరిస్ట్ ఆదిల్ సాయం
- ఓ ఫొటోగ్రాఫర్ చెట్టుపైనుంచి తీసిన వీడియోనే కీలక సాక్ష్యం
- ప్రత్యక్ష సాక్షిగా ఘటన తీరును వివరించిన ఆర్మీ ఆఫీసర్
- దక్షిణ కాశ్మీర్లో టెర్రరిస్టులకు సాయం చేసే15 మంది గుర్తింపు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో పహల్గాం సమీపంలోని బైసరన్‌లో ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి వెనక నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టెర్రరిస్టులు కోకెర్ నాగ్ వైపు నుంచి 22 గంటలపాటు కొండలు, అడవులు దాటుకుంటూ బైసరన్ మైదానానికి చేరుకుని నరమేధానికి పాల్పడినట్టుగా దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ దాడి తర్వాత మళ్లీ వారు అదే అడవుల్లోకి పారిపోయారని అంచనాకు వచ్చారు. బైసరన్ లో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్తాన్ కు చెందినవారు కాగా, మరొకరు స్థానిక టెర్రరిస్ట్ ఆదిల్ థోకర్ అని ఇదివరకే తేల్చారు.
బైసరన్ ఉగ్రదాడి ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తును ప్రారంభించింది. బైసరన్ మైదానంలో టెర్రరిస్టుల కాల్పులకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. ఫోరెన్సిక్ అనలైసిస్ను బట్టి టెర్రరిస్టులు ఏకే 47 గన్స్, ఎం4 రైఫిల్స్ ను వాడినట్టు గుర్తించింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర అంశాలను బట్టి.. ఉగ్రమూకలు దాడి చేసిన తీరును ఎన్ఐఏ అధికారులు తెలుసుకుంటున్నారు.
‘‘అడవుల గుండా వచ్చిన నలుగురు టెర్రరిస్టుల్లో ఇద్దరు ముందుగా బైసరన్ మైదానంలోని షాపుల వెనక దాక్కున్నారు. టూరిస్టులు పోగు కాగానే హటాత్తుగా గన్స్‌తో బయటకు వచ్చి కలిమా చదవాలని ఆదేశించారు. తర్వాత టార్గెట్ చేసిన టూరిస్టులను కచ్చితంగా చనిపోయేలా తలలపై, ఛాతీలపై కాల్చారు.
దీంతో అక్కడున్న టూరిస్టులంతా ప్రాణభయంతో చెల్లాచెదురై పరుగులు తీశారు. ఇదేసమయంలో జిప్ లైన్ ఏరియా వద్ద సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఓ టూరిస్ట్, ఓ స్థానికుడి సెల్ ఫోన్లను లాక్కుని అడవుల్లోకి పారిపోయారు” అని ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
చెట్టెక్కి వీడియో తీసిన లోకల్ వ్యక్తి..
బైసరన్ మైదానంలో టెర్రరిస్టులు కాల్పులు జరపగానే.. లోకల్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెంటనే అక్కడున్న చెట్టుపైకి ఎక్కాడు. అక్కడ ఉగ్రమూకలు సాగించిన అరాచకత్వాన్ని అంతా తన కెమెరాతో వీడియో తీశాడు. ఇప్పుడు ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఈ వీడియో కీలక ఆధారంగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే సంఘటన సమయంలో ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఒకరు కూడా అక్కడే ఉన్నారని.. ఆయన ముందుగా తన ఫ్యామిలీని రక్షించుకుని.. తర్వాత టెర్రరిస్టుల దారుణాలను రికార్డ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఈయన ఇచ్చిన వాంగ్మూలం కూడా కేసులో కీలకం కానుందని అంటున్నారు.
టెర్రరిస్టులకు15 మంది లోకల్స్ సాయం..
దక్షిణ కాశ్మీర్లో 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సాయం చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ గా పని చేస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్టులకు వీరు స్థానికంగా రవాణా, వసతి, ఆయా ప్రాంతాలకు కొండలు, అడవుల గుండా వెళ్లేందుకు దారి చూపడం వంటి సాయం చేస్తుంటారని.. పక్క దేశం నుంచి వచ్చే ఆయుధాలను రవాణా చేసి, టెర్రరిస్టులకు చేరవేయడం కూడా చేస్తుంటారని చెప్తున్నారు.
పహల్గాం ఘటనలో లోకల్ టెర్రరిస్ట్ ఆదిల్ థోకర్ తోపాటు ప్రధానంగా ఐదుగురు స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్లు పాక్ టెర్రరిస్టులకు సాయం చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 200 మంది స్థానికులను విచారించిన అధికారులు చివరిగా ఐదుగురిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఎన్ఐఏ కేసు నమోదు
బైసరన్ ఉగ్రదాడి ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. టెర్రరిస్టులు కాల్పులకు తెగబడిన బైసరన్ మైదానంలో ఆధారాలు సేకరించడంతోపాటు ప్రత్యక్ష సాక్షులను విచారించి మొత్తం ఉగ్రదాడి ఘటన జరిగిన తీరును రికార్డ్ చేసేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంగళవార ఉగ్రదాడి జరిగిన వెంటనే ఐజీ నేతృత్వంలోని ఎన్ఐఏ టీం కూడా బైసరన్ కు చేరుకుంది. తాజాగా కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఆదివారం జమ్మూలో కేసు నమోదు చేసి, అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది.