బిగ్ బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ అభిమానుల మధ్య డిసెంబర్ 17 అర్థరాత్రి ఘర్షణ జరిగింది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న వారు రచ్చరచ్చ చేశారు. ముందు వారి మధ్య వాగ్వాదం మొదలు కాగా ఆ తరువాత అది గొడవకు దారి తీయడంతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్‌దీప్ కారు అద్దాలను కూడా పగలగొట్టారు.
ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. అంతేకాకుండా ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని కారుపై కూడా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ గా మారాయి.
‘బిగ్ బాస్ సీజన్–7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. వంద రోజులకుపైగా సాగిన ఆటలో అతడిని విజయం వరించింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్–7 టైటిల్‌ను పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నాడని ప్రోగ్రాం హోస్ట్, హీరో నాగార్జున ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్‌గా నిలిచారని వెల్లడించారు.
ఒక సాధారణ యూట్యూబర్, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు ట్రోఫీతో పాటు రూ.35 లక్షల చెక్‌ను నాగార్జున అందజేశారు. మారుతీ సుజుకీ బ్రెజా ఎస్యూవీ కీ కూడా ఇచ్చారు. జోస్ అలుక్కాస్ నుంచి డైమండ్ జువెలరీ కొనుగోలు కోసం రూ.15 లక్షల చెక్ కూడా ఆ సంస్థ ఎండీ అందజేశారు.
