
ప్రభుత్వ అస్తుల ధ్వంసం కేసులోఅరెస్టైన బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరి ప్రసాద్ తెలిపారు. ప్రశాంత్ తమ్ముడు మహా వీరేశంకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. డిసెంబర్ 20 రాత్రి ప్రశాంత్, వీరేశంలను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పీఎస్ లో కాసేపు విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
జడ్జి రిమాండ్ విధించడంతో ప్రశాంత్, వీరేశంలను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్‌ఎస్‌ఐ మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 17న బిగ్‌బాస్ సీజన్ –7 ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్‌బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అశ్వినీ కార్లను, ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.