Bigg Boss Telugu 9: క్లైమాక్స్‌కి బిగ్ బాస్ 9: సామాన్యుడి అసామాన్య పోరాటం.. టైటిల్ రేసులో కల్యాణ్ చరిత్ర సృష్టిస్తారా?

Bigg Boss Telugu 9: క్లైమాక్స్‌కి బిగ్ బాస్ 9:  సామాన్యుడి అసామాన్య పోరాటం.. టైటిల్ రేసులో కల్యాణ్ చరిత్ర సృష్టిస్తారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు ఇక కేవలం రెండు రోజులే సమయం ఉంది.  దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్ల 'జర్నీ వీడియోలు' (AV) ప్రేక్షకులను భావోద్వేగంలో ముంచెత్తుతున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన కల్యాణ్ జర్నీ ప్రోమో చూస్తుంటే, ఒక కామనర్ చరిత్ర సృష్టించే దిశగా ఎలా అడుగులు వేశాడో అర్థమవుతోంది. 103వ రోజు ఎపిసోడ్‌లో భాగంగా కల్యాణ్ పడాల ప్రయాణాన్ని బిగ్‌బాస్ అద్భుతంగా ఆవిష్కరించారు. సామాన్యుడిగా అడుగుపెట్టి, అసామాన్యుడిగా ఎదిగిన కల్యాణ్ పడాల జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

సామాన్యుడి అసామాన్య పోరాటం..

హౌస్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ రూంలోకి వచ్చిన కల్యాణ్ ను బిగ్ బాస్ అభినందించారు.  "మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. ఓనర్ గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. ఎన్నో కఠినమైన అగ్నిపరీక్షలను మీ ముందుకు తీసుకువచ్చింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వారందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుండి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా.. తేరుకున్నారు అని బిగ్ బాస్ ప్రశంసిస్తారు.

బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించిన బలం గుండె బలం.. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అనే మీ బలాలను ఎప్పుడూ వీడకుండా.. లోటుపాట్లన్నీ సరిచేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాక, మొదటి ఫైనలిస్ట్ గా కూడా నిలిచి.. ఒక కామనర్ తలచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు అని బిగ్ బాస్  కల్యాణ్ ను అభినందిస్తారు.  

కామనర్ చరిత్ర సృష్టించే దిశగా.. 

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'ఓనర్' హోదాలో, ఒక సామాన్యుడి ప్రతినిధిగా కల్యాణ్ అడుగుపెట్టారు. సెలబ్రిటీల మధ్య ఒక సామాన్యుడు ఎలా నెట్టుకొస్తాడు? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, తనదైన శైలిలో ఆటను రక్తికట్టించారు. జర్నీ వీడియో చూస్తున్న సమయంలో కల్యాణ్ గడిచిన 100 రోజులను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్‌బాస్ ఈ సందర్భంగా కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

 మొత్తానికి ఈ ప్రోమో  వీడియోలో చూపించిన ఎమోషనల్ సీన్స్, విజయ గర్జనలు చూస్తుంటే ఈసారి టైటిల్ రేసులో కల్యాణ్ గట్టి పోటీ ఇస్తున్నాడని స్పష్టమవుతోంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో కల్యాణ్ పడాల విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారా? లేక రన్నరప్‌తో సరిపెట్టుకుంటారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.