IPL 2026: మినీ ఆక్షన్ ముందు ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఖరీదైన ఆటగాళ్లు వీరే!

IPL 2026: మినీ ఆక్షన్ ముందు ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఖరీదైన ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ 2026 మినీ మెగా ఆక్షన్ డిసెంబర్ 16 న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మినీ ఆక్షన్ కు ముందు ఫ్రాంచైజీలు కొంతమంది స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసి షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ విడుదలకు బీసీసీఐ విధించిన డెడ్ లైన్ శనివారం (నవంబర్ 15)తో లాస్ట్ కావడంతో 10 జట్ల ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే.. రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించింది. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..    

వెంకటేష్ అయ్యర్ (కోల్‎కతా నైట్ రైడర్స్ రూ. 23.75 కోట్లు) 

ఐపీఎల్ 2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టిన సంగతి తెలిసిందే. వెంకటేశ్ అయ్యర్‎ను కోల్‎కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ అంతకముందు నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. దీంతో అయ్యర్ ను కేకేఆర్ నమ్మి భారీ ధరకు జట్టులోకి తీసుకుంది. అయితే అయ్యర్ 11 మ్యాచ్ ల్లో 139.22 స్ట్రైక్ రేట్‌తో కేవలం 142 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కేకేఆర్ అయ్యర్ ను వదిలేసుకుంది.   

మతీష పతిరానా (చెన్నై సూపర్ కింగ్స్ రూ.13 కోట్లు): 

చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం మతీష పతిరానాని CSK బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ లంక ఫాస్ట్ బౌలర్ ను చెన్నై రూ.13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. అయితే పతిరానా ఐపీఎల్ 2025 సీజన్ లో తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో 10.13 ఎకానమీతో 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ధారాళంగా పరుగులివ్వడంతో పాటు గాయాలు కావడంతో పతిరాణాని చెన్నై రిలీజ్ చేసింది. 

ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 12 కోట్లు)  

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులోని జట్టు స్టార్ ఆల్ రౌండర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రస్సెల్ కు ఈ సారి ఆ జట్టు ఫ్రాంజైజీలు రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రస్సెల్.. గత సీజన్ లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ రస్సెల్ ను వదులుకునేందుకు సిద్ధమైంది. 2025 ఐపీఎల్ సీజన్ లో ఈ విండీస్ ఆల్ రౌండర్ 167 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు పడగొట్టాడు. వయసు ఎక్కువగా ఉండడంతో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం రస్సెల్ కు మైనస్ గా మారింది. 

రవి బిష్ణోయ్ (లక్నో సూపర్ జెయింట్స్ రూ. 11కోట్లు)  

స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ టీమిండియా స్పిన్నర్ ను లక్నో  రూ.11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. అయితే బిష్ణోయ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 11 మ్యాచ్ ల్లో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఎకానమీ కూడా ఎక్కువగా ఉండడంతో పాటు టీమిండియాలో చోటు కోల్పోయాడు. దీంతో బిష్ణోయ్ కి లక్నో చెక్ పెట్టింది. 


లియామ్ లివింగ్‌స్టోన్‌ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 8.75 కోట్లు)
  
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్‌ కు బెంగళూర్ గుడ్ బై చెప్పింది. లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్ లోనూ పెద్దగా రాణించింది లేదు.  38 సగటుతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ పవర్ హిట్టర్ ను రిలీజ్ చేసి మినీ ఆక్షన్ కు పెద్ద మొత్తంలో వెళ్లాలని చూస్తుంది. 

డేవిడ్ మిల్లర్ (లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5కోట్లు)  

ఐపీఎల్ హిస్టరీలోనే కాదు ప్రపంచ టీ20 ఫార్మాట్ లో డేవిడ్ మిల్లర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్. ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నీల్లో ఎన్నో మ్యాచ్ ల్లో మిల్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించాడు. ప్రతి సీజన్ లో నిలకడగా రాణిస్తూ.. తన పవర్ హిట్టింగ్ తో ఆకట్టుకునే మిల్లర్ ఐపీఎల్ 2025 సీజన్ లో తేలిపోయాడు. ఫినిషర్ గా వచ్చి జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. 11 మ్యాచ్ ల్లో 153 మాత్రమే చేసిన మిల్లర్ జట్టుకు భారంగా మారాడు. దీంతో సూపర్ జెయింట్స్ ఈ సఫారీ ఆటగాడిని రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ సౌతాఫ్రికా ఆటగాడిని లక్నో రూ.7.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా తీవ్రంగా నిరాశపరిచాడు.