మీ కాళ్లు మొక్కుతా.. రోడ్డు త్వరగా పూర్తిచేయండి : బిహార్ సీఎం నితీశ్

మీ కాళ్లు మొక్కుతా.. రోడ్డు త్వరగా పూర్తిచేయండి : బిహార్ సీఎం నితీశ్

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఓ ప్రైవేట్ కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాట్నాలో రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల ని కంపెనీ ప్రతినిధిని కోరారు. కావాలంటే మీ కాళ్లు మొక్కుతానని వేదిక పైనుంచి లేచి ముందుకొచ్చారు. బుధవారం పాట్నాలోని జేపీ గంగా పాత్‌‌వే మూడో దశను సీఎం నితీశ్​ కుమార్ ​జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం దిఘా నుంచి పాట్నా మెడికల్ కాలేజ్ వరకు 12.5 కిలోమీటర్ల పొడవునా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. అదనంగా మరో 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ నిర్మాణం జరుగుతోంది. 

దీనిని పాట్నా ఘాట్ వరకూ విస్తరిస్తున్నారు. దిఘా నుంచి గైఘాట్ వరకూ ట్రాఫిక్‌‌ను తెరవడం వల్ల ప్రజలు పాట్నా నగరానికి చేరుకోవడానికి అశోక్ రాజ్ పథ్‌‌లో రద్దీని నివారించవచ్చు. ఈ పనుల పురోగతిపై నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వేదికపైనే కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సీట్లోంచి లేచి చేతులు జోడించి.. ‘మీరు కావాలనుకుంటే.. మేము మీ పాదాలకు మొక్కుతాం’ అంటూ కంపెనీ ప్రతినిధితో అన్నారు. 

అనంతరం కొద్దిసేపటికి సీఎం శాంతించారు. ఇటీవల బిహార్​లో డజనుకు పైగా వంతెనలు కూలిపోవడం.. రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం తీరు ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఈ ఘటనపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ​స్పందిస్తూ.. సీఎం నితీశ్​ కుమార్ ​అశక్తుడిగా మారిపోయారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులతో ప్రైవేటు రంగానికి చెందిన వారి కాళ్లపై పడడానికి సీఎం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.