మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ సీఎం

మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ సీఎం

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఆయన మీడియాపై విరుచుకుపడ్డారు. తన నివాసానికి సమీపంలో జరిగిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ హత్యకు సంబంధించి మీడియా అనాలోచిత ప్రశ్నలను అడుగుతోందంటూ ఆరోపించారు. మీకు ఏవైనా ఆధారాలు లభిస్తే..పోలీసులకు తెలిపి… నేరాన్ని పరిష్కరించేందుకు సాయపడండి అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఇండిగో మేనేజర్‌ రూపేష్‌ కుమార్‌ సింగ్‌ను ఆయన ఇంటి దగ్గర ..ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై ఆయనకు ప్రశ్నలు ఎదురు కాగా.. కోపంతో ఊగిపోయారు. 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భార్యాభర్తలిద్దరూ పరిపాలించారని…ఆ సమయంలో చాలా నేరాలు జరిగాయన్న సీఎం నితీష్.. అప్పుడెందుకు హైలెట్‌ చేయలేదని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవీపై పరోక్ష విమర్శలు చేశారు. ఏదైనా నేరాలు జరిగితే..చర్యలు తీసుకుంటామని అన్నారు. మీకు గౌరవమిస్తాము…కానీ  మీ ప్రశ్నలు పూర్తిగా అర్ధం లేనివిగా ఉన్నాయన్నారు. ప్రతి హత్య వెనుక ఉద్ధేశం ఉంటుందని, హత్యకు కారణాలు తెలుసుకోవాలన్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పారు. మీకెమైనా ఆధారాలు దొరికితే..పోలీసులకు తెలియపరచి సహకరించడని కోరారు సీఎం నితీష్ కుమార్.