సాయంత్రం గవర్నర్ ను కలవనున్న నితీశ్

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న నితీశ్

బీహార్ లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ బయటకు రావడం దాదాపు ఖాయమైంది. కాసేపట్లో  బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ను కలవనున్నారు నితీశ్ కుమార్.  సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు జేడీయూ నేతలు. బీజేపీతో పొత్తు వీడుతున్నట్లు జేడీయూ నేతలు.. గవర్నర్ కు అధికారికంగా చెప్పే ఛాన్స్ ఉంది. దీంతో నితీశ్ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అప్పుడు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.



మరోవైపు ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ పై వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. బీజేపీకి చెందిన 16 మంది బిహార్ మంత్రులు రాజీనామాకు రెడీ అయ్యారు. నితీశ్ కుమార్ నిర్ణయం తర్వాత ఏదైనా చెప్పగమని తెలిపారు బీజేపీ నేతలు.

అంతకుముందు పాట్నాలోని తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు నితీశ్ కుమార్. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాగట్ బంధన్ కూటమి ఎమ్మెల్యేలు కూడా లాలూ నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా సీఎం నితీశ్ ఉండేలా మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష నేతలు లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కు అందజేశారు. మహాగట్ బంధన్ లోకి నితీశ్ వస్తానంటే తప్పకుండా  స్వాగతిస్తామని కాంగ్రెస్ నేత అజిత్ శర్మ అన్నారు . 

బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ప్రస్తుతం BJPకి 77, JDUకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. NDA కూటమికి 122 మంది బలం ఉంది. RJDకి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ నేతృత్వం వహిస్తున్నారు. కాగా.. RJDకి 79 మంది , కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. లెఫ్ట్ పార్టీలకు 16 మంది శాసనసభ్యుల బలం ఉంది. హిందుస్తానీ అవామ్ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేగా ఒకరు ఉండగా.. మరోస్థానం ఖాళీగా ఉంది.

గతంలో RJD, కాంగ్రెస్ తో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. RJDపై అవినీతి ఆరోపణలతో కొంతకాలం క్రితం ఆ పార్టీ నుంచి బయటకొట్టి BJPతో జట్టు కట్టారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో కలిసి పోటీ చేయగా.. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు 122 నియోజవర్గాల్లో గెలుపొందారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. మిత్రధర్మం పాటిస్తూ నితీశ్ కుమార్ కే సీఎం పదవి అప్పగించింది. 

గత కొంతకాలంగా బీజేపీ, జేడీయూ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. బీహార్ లో కూటమి ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటు కావట్లేదని ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమాజీ మంత్రి, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ పార్టీకి రాజీనామా చేసి నితీశ్ పై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కేబినెట్ లో జేడీయూ నుంచి కేంద్రమంత్రిగా పనిచేశారు ఆర్సీపీ సింగ్. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో.... ఇటీవలే పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేతలకు సన్నిహతుడు అయిన ఆర్సీపీ సింగ్ ను అడ్డుపెట్టుకుని జేడీయూను చీల్చే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.

గత నెలరోజులుగా బీజేపీతో దూరంగా ఉంటున్నారు నితీశ్ కుమార్. ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఅయోగ్ మీటింగ్ కి, గత నెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు. రామ్ నాథ్ కోవింద్ పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు పార్టీకి, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వీకారానికి హాజరవ్వలేదు.