బైక్ పోగొట్టుకున్న వ్యక్తికి.. పల్సర్ కొనిచ్చిన రాహుల్

బైక్ పోగొట్టుకున్న వ్యక్తికి.. పల్సర్ కొనిచ్చిన రాహుల్

ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఆసక్తికర ఘటన

పాట్నా: బిహార్‌‌‌‌లోని పాట్నాలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన రోడ్ షోలో బైక్ పోగొట్టుకున్న ఓ ధాబా యజమానికి రాహుల్ గాంధీ పల్సర్ 220 బైక్‌‌‌‌ను గిఫ్ట్​గా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 27న రాహుల్ దర్భంగాలో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. 

ఈ సందర్భంగా హైవే పక్కన "మా దుర్గా లైన్" ధాబాను నిర్వహిస్తున్న శుభం సౌరభ్‌‌‌‌..పల్సర్ 220 బైక్‌‌‌‌ను రాహుల్ భద్రతా సిబ్బంది తీసుకున్నారు. రోడ్ షో పూర్తయ్యాక తిరిగిస్తామని చెప్పారు. అయితే, ర్యాలీ ముగిసిన తర్వాత శుభం బైక్ కనిపించలేదు. ఎంత వెతికినా బైక్ దొరకకపోవడంతో శుభం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో  రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. దీంతో  సోమవారం పాట్నాలో జరిగిన యాత్ర ముగింపు కార్యక్రమంలో రాహుల్ స్వయంగా శుభంకు కొత్త పల్సర్ బైక్ కీని అందజేశారు.