నకిలీ పోలీస్ స్టేషన్.. దిమ్మతిరిగేలా బీహార్ గ్యాంగ్ ప్లాన్

నకిలీ పోలీస్ స్టేషన్.. దిమ్మతిరిగేలా బీహార్ గ్యాంగ్ ప్లాన్

నకిలీ పోలీసులు గురించి వినడం మామూలే.. కానీ నకిలీ పోలీస్ స్టేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా.. అవును బీహార్లో నకిలీ పోలీస్స్టేషన్ నడుపుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ లోని బాంకా జిల్లాలో ఓ ముఠా గెస్ట్ హౌస్ను పోలీస్స్టేషన్గా మార్చి అక్రమాలకు పాల్పడుతోంది. 8 నెలలుగా వీరు ఈ దందా చేస్తుండగా ఎట్టకేలకు పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 

నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. తామంత రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నామని తెలిపారు. అనితా దేవి అనే మహిళ ఈ స్టేషన్ ఎస్హెచ్వోగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సీఎం హేమంత్ సోరెన్ తనను ఇన్స్పెక్టర్గా నియమించారని అనితా తెలిపింది. తామంతా సీనియర్ పోలీస్ అధికారి భోళా యాదవ్ సారథ్యంలో పనిచేస్తున్నామని నిందితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

వీరంతా పోలీసుల పేర్లు చెప్పి పెద్దఎత్తున మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్  కు రాగా వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకుని రాజీ కుదిర్చి పంపించేవారని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ప్రధాన నిందితుడు భోళా యాదవ్ను పట్టుకుంటామని తెలిపారు. అయితే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ స్థానిక ఎస్పీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం.