వడ్ల కొనుగోళ్లపై బిహార్ ఎలక్షన్ ఎఫెక్ట్.. ఓటేసేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర కూలీలు

వడ్ల కొనుగోళ్లపై బిహార్ ఎలక్షన్ ఎఫెక్ట్.. ఓటేసేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర కూలీలు
  • హమాలీలు లేక మిల్లుల్లో లోడింగ్, అన్​లోడింగ్కు ఇబ్బందులు
  • కూలీలు లేక కొనుగోలు సెంటర్లలో ఆగుతున్న కాంటాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ‘బిహార్ ఎలక్షన్ ఎఫెక్ట్’ పడింది. రాష్ట్రంలో సుమారు రెండు వేల దాకా రైస్ ​మిల్లులు ఉండగా, చాలా చోట్ల బిహార్​ కూలీలే హమాలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది బిహార్​ ఎన్నికల కోసం సొంత రాష్ట్రానికి తరలివెళ్లడంతో మిల్లుల్లో లోడింగ్, అన్​లోడింగ్ నిలిచిపోయి లారీలన్నీ మిల్లుల వద్దే బారులుతీరుతున్నాయి. మిల్లుల్లో అన్​లోడింగ్​ ఆగిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి నిర్వాహకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సారి వానాకాలం సీజన్​లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్​సప్లైశాఖ లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 6.98 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది.

రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలకుగాను, 6,586 సెంటర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి. 1.30 లక్షల మంది రైతుల నుంచి 3.70 లక్షల టన్నులు దొడ్డు రకాలు, 3.28 లక్షల టన్నులు సన్న రకాలు సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.869 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. బోనస్​ రూపంలో మరో రూ.36 కోట్లు విడుదల చేశారు. కానీ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. చాలా ప్రాంతాల్లో కోతలు పూర్తయినా, ధాన్యం తరలింపు, మిల్లులకు కేటాయింపు ప్రక్రియ ఆలస్యమవుతున్నది. ప్రధానంగా మిల్లుల్లో అన్​లోడింగ్​ప్రక్రియ లేటవుతున్నదని సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. ఆరా తీస్తే ఇందుకు హమాలీల కొరతే కారణమని తేలింది.  

బిహార్ ఎన్నికలకు హమాలీలు.. అన్​లోడ్​కాని లారీలు..
రాష్ట్రంలో 1,024 రా మిల్లులు, 970 బాయిల్డ్ మిల్లులు కలిపి మొత్తం 1,997 రైస్​మిల్లులు ఉన్నాయి. లోడింగ్​, అన్​లోడింగ్​, మిల్లింగ్​కోసం ప్రతి మిల్లులో కనీసం 50 నుంచి 200 మంది దాకా హమాలీలు పనిచేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రైస్ మిల్లుల్లో  సుమారు 20 వేల మంది హమాలీలు పనిచేస్తున్నారు. 

వీరిలో 90 శాతం అంటే 18 వేల మంది బిహార్​ నుంచి వలసవచ్చినవారే. స్థానికంగా హమాలీలు దొరక్కపోవడం, ఉన్న కొద్దిమంది ఎక్కువ కూలీ డిమాండ్​ చేస్తుండడం, ఇతరత్రా పలు కారణాలతో బిహార్​ నుంచి కూలీలను తెప్పించుకోవాల్సి వస్తున్నదని మిల్లర్లు చెప్తున్నారు. మరోవైపు లోకల్​హమాలీలు మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకే పరిమితమయ్యారు. కాగా, ప్రస్తుతం బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి బిహార్​ఎన్నికలు హోరాహోరీగా జరుగుతుండడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. దీంతో అక్కడి పార్టీలు వలస కార్మికులపై ఫోకస్​పెట్టాయి.

ముఖ్యంగా కహగరియా, సుపౌల్ జిల్లాల్లోని అభ్యర్థులు తమ నియోజకవర్గాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ఫోన్లు చేసి ఓట్లు వేసేందుకు రప్పించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు, ఆపైన ఇవ్వడంతోపాటు రానుపోను ట్రైన్​చార్జీలు చెల్లించడంతో చాలామంది బిహార్​హమాలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో మిల్లుల్లో హమాలీల సంఖ్య తగ్గిపోయి ధాన్యం అన్​లోడింగ్​కు ఇబ్బంది అవుతున్నది.

‘‘బిహార్ నుంచి వచ్చిన హమాలీల్లో చాలామంది తమ సొంత రాష్ట్రానికి వెళ్లడంతో మిల్లుల్లో 60 శాతం పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా అన్​లోడింగ్​ఆగిపోయి, మిల్లుల ముందు బారులు తీరుతున్నాయి. దీంతో కల్లాల్లో తూకాలు నిలిచిపోయాయి. ఈ నెల 11న ఎన్నికలు ముగుస్తాయి..13 కల్లా కూలీలంతా తిరిగి ఇక్కడికి చేరుకుంటారు’’ అని కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ మిల్లర్​‘వెలుగు’తో చెప్పారు.