
బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) దేశ వ్యాప్తగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లోనూ విపక్షాలు సర్ పై చర్చకు పట్టుబడుతున్నాయి.
2025 చివరి నాటికి బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 52 లక్షల మంది ఓటర్లను తొలగించింది. అయితే దీనిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. తొలగించిన 52 లక్షల మంది ఓటర్ జాబితాలో 18 లక్షల మంది చనిపోయిన వారు...ఇతర చోట్లకు వలస వెళ్లిన ఓటర్లు 26 లక్షల మంది.. అదే సమయంలో రెండు చోట్ల ఓటు ఉన్న వారు 7 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది.
అయితే జూన్ 24 , 2025 SIR ఆదేశం ప్రకారం ఎవరైనా ఓటర్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు తెలియజేయవచ్చని సూచించింది. ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోతే మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాం.. సెప్టెంబర్ 31 న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపింది. అభ్యర్థులు నామినేషన్ వేసే చివరి రోజు వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం ఇస్తామని సీఈసీ చెప్పింది.
‘సర్’ ను సమర్థించుకున్న ఈసీ
బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు జాబితా సవరణ అనర్హులను తొలగించి ఎన్నికల స్వచ్ఛతను పెంచుతుందని భారత ఎన్నికల సంఘం సమర్థించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జూన్ 24న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆధార్, ఓటరు ఐడీ, రేషన్ కార్డుల గుర్తింపు కోసం మాత్రమే చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య స్వచ్ఛందంగా సమర్పించవచ్చని, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం గుర్తింపు కోసం ఉపయోగిస్తారని తెలిపింది. ఆధార్ పౌరసత్వ రుజువు కాదని ఆధార్ యాక్ట్ స్పష్టం చేస్తుందని పేర్కొంది. అయితే, అనర్హులు ఎవరైనా ఉంటే వారికి ఓటు హక్కు లేకుండా చేస్తుందని తెలిపింది.