వాళ్లను ఆధార్ ప్రామాణికంగా ఓటర్ లిస్ట్లో చేర్చండి

వాళ్లను ఆధార్ ప్రామాణికంగా  ఓటర్ లిస్ట్లో చేర్చండి
  • బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం ఆదేశం 
  • ఓటర్ల పేర్లు సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలకు 
  • బాధ్యత లేదా? అని ప్రశ్న
  • పార్టీలు ఏం చేస్తున్నయ్?

న్యూఢిల్లీ: బిహార్ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వారిని, వాళ్ల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని తిరిగి జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ అయిన తమ పేర్లను తిరిగి చేర్పించుకునే విషయంలో రాజకీయ పార్టీల కంటే ఓటర్లే యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోందని కామెంట్ చేసింది. ‘‘ఓటర్ లిస్ట్ సవరణలో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? వాటికి బాధ్యత లేదా? ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్పించుకునేలా ఎందుకు సహాయం చేయడంలేదు?” అని ప్రశ్నించింది. బిహార్ ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)’ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ కొనసాగించింది. ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ప్రకటించిన 11 గుర్తింపుకార్డులతోపాటు ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. ఈ 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాని ఆధారంగా ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలని తెలిపింది.‘‘డూప్లికేట్ ఎంట్రీలు, చనిపోయినవాళ్లను తీసేస్తే.. ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు కోల్పోయిన వాళ్లు దాదాపు 35 లక్షల మంది ఉంటారు. వీళ్లందరి పేర్లను చేర్చేందుకు డాక్యుమెంట్ల ఫైలింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 1లోపు పూర్తి చేయండి” అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.

బిహార్​లో ఓటర్ల జాబితాలోంచి పేర్ల తొలగింపుపై ఓటర్లే వ్యక్తిగతంగా పిటిషన్లు వేస్తున్నారని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ‘‘ఇప్పటివరకూ ఓటర్లతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా మాత్రమే పిటిషన్లు వేశారు. కానీ రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి పిటిషన్లు రాలేదు. రాష్ట్రంలో పొలిటికల్ పార్టీలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుగా లేదు. ఆయా పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించింది. అన్ని పార్టీల నుంచి 1.6 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు ఉండగా.. ఓటర్ల తొలగింపునకు సంబంధించి రెండే అభ్యంతరాలు రావడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, ఏజెంట్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినా.. ఎన్నికల అధికారులు అక్నాలెడ్జిమెంట్ ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ వృందా గ్రోవర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఏజెంట్లకు అక్నాలెడ్జిమెంట్ రిసీప్టులు ఇవ్వాలని ఈసీని కోర్టు ఆదేశించింది. ఈసీ తరఫు అడ్వకేట్ రాకేశ్ ద్వివేదీ స్పందిస్తూ.. పేర్లు కోల్పోయిన ఓటర్ల తరఫున రోజూ ఒక్కో ఏజెంట్ 10 ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, ఇప్పటివరకూ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లిఖితపూర్వకంగా అభ్యంతరాలు సమర్పించలేదని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి తప్పుడు విధానంలో పేర్లను తొలగించలేదని, ఈ విషయంలో పూర్తి ఆధారాలను, వివరాలను సమర్పించేందుకు15 రోజుల సమయం కావాలన్నారు. పేర్లు తొలగించిన వారిలో 85 వేల ఓటర్లు తమను తిరిగి చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారని, కొత్తగా 2 లక్షల మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు.