కందనూలు, వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించే ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. క్వింటాల్ మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా 82,400 ఎకరాల్లో సాగైన పంటను సేకరించడమే లక్ష్యమని, రైతులకు సరైన ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
అనంతరం బిజినేపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, పీఏసీఎస్ అధికారులు రవీందర్, రవికుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
