బిల్‌గేట్స్ విడాకులు.. భరణం 5 లక్షల కోట్లు?

బిల్‌గేట్స్ విడాకులు.. భరణం 5 లక్షల కోట్లు?
  • బిల్‌గేట్స్ సంపదలో 50:50 సర్దుకునే అవకాశం
  • ప్రస్తుతం ఆయన సంపద రూ. 10 లక్షల కోట్లకు పైనే
  • మెకెంజీ బెజోస్‌కు రూ. 2 లక్షల కోట్ల భరణం ఇచ్చిన అమెజాన్ ఫౌండర్‌‌

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: మైక్రోసాఫ్ట్‌‌ ఫౌండర్‌‌‌‌  బిల్‌‌గేట్స్‌‌, ఆయన భార్య మెలిందా గేట్స్‌‌కు భారీ మొత్తంలో  భరణం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడాకులు తీసుకుంటున్నామని ఈ భార్యభర్తలు ప్రకటనలు చేశారు. దీంతో అమెజాన్‌ బాస్‌ జెఫ్‌‌ బెజోస్‌‌ భరణం కోసం చెల్లించిన దాని కంటే ఎక్కువ అమౌంట్‌‌ను బిల్‌‌గేట్స్‌‌ ఇస్తారేమో చూడాలి. గత 27 ఏళ్ల నుంచి కలిసున్న ఈ బిల్‌‌గేట్స్‌‌–మెలిందా గేట్స్‌‌  విడిపోవాలని నిర్ణయించుకున్నారు. బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం బిల్‌‌గేట్స్‌‌ సంపద 146  బిలియన్ డాలర్లు(రూ.10.8 లక్షల కోట్లు). ఒకవేళ తన సంపదలో  మెలిందా గేట్స్‌‌కు సగం వాటా ఇచ్చేస్తే ఆయన సంపద 73 బిలియన్ డాలర్ల(రూ. 5.4 లక్షల కోట్ల) కు పడిపోతుంది.  అంటే ఆయన సంపద విషయంలో 2017 స్థాయికి పడిపోతారు. కిందటేడాది మార్చి నాటికి బిల్‌‌గేట్స్‌‌ సంపద 105 బిలియన్ డాలర్లు గానే ఉంది. గత ఏడాది కాలంలో ఆయన సంపద విపరీతంగా పెరిగింది. విడాకులు తీసుకుంటామని ట్విటర్ ద్వారా ప్రకటించిన బిల్‌‌గేట్స్‌‌,  ఫైనాన్షియల్ విషయాలను ప్రకటించలేదు. 
ఆస్తుల పంపకం అంత ఈజీ కాదు..
అమెజాన్‌‌ ఫౌండర్‌‌‌‌  జెఫ్‌‌ బెజోస్‌‌, మెకెంజీ స్కాట్‌‌లు 2019 విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్‌‌గా  ఈ  విడాకులు నిలిచిపోయాయి. తాజాగా బిల్‌‌గేట్స్‌‌, మెలిందా బ్రేకప్‌‌ ఈ రికార్డ్‌‌ను క్రాస్ చేస్తుందేమో చూడాలి. మరోవైపు బిల్‌‌గేట్స్ సంపదను డివైడ్‌‌ చేయడం కూడా జెఫ్‌‌–మెకెంజీ విషయంలో జరిగినట్టు ఈజీగా కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే  బెజోస్‌‌ సంపద అమెజాన్‌‌ ద్వారే ఎక్కువగా వస్తోంది.  కానీ బిల్‌‌గేట్స్‌‌ మొత్తం సంపదలో మైక్రోసాఫ్ట్ వాటా 20 శాతానికి కూడా మించదు. కంపెనీలో ఆయన మెజార్టీ వాటాలను  2000–2004 టైమ్‌‌లోనే అమ్మేశారు. ప్రస్తుతం బిల్‌‌గేట్స్‌‌కు మైక్రోసాఫ్ట్‌‌లో 1.3 శాతం వాటానే ఉంది. కానీ,  మైక్రోసాఫ్ట్‌‌ షేర్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో ఆయన మిగిలిన కంపెనీలలో ఇన్వెస్ట్‌‌ చేశారు. ముఖ్యంగా వారెన్‌‌ బఫెట్‌‌కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ బెర్క్‌‌షైర్ హత్‌‌వేలో బిల్‌‌గేట్స్‌‌కు సుమారు 11 శాతం వాటా ఉంటుంది.  అమెరికన్ చట్టాల ప్రకారం పెళ్లీ ద్వారా వచ్చిన సంపదపై భార్యభర్తల ఇరువురికి సమాన వాటా ఉంటుంది. కానీ, దానర్ధం 50:50 శాతం పంచుకుంటారని కాదు. ‘కచ్చితంగా 50:50 పద్ధతిలో ఆస్తులను పంచుకుంటారని లేదు.  కొన్ని సార్లు కోర్టు అంతకంటే ఎక్కువ లేదా తక్కువ ఆస్తిని భరణం కింద ఇవ్వమని ఆదేశించొచ్చు’ అని బిల్‌‌గేట్స్‌‌ ఫ్యామిలీ లాయర్ పేర్కొన్నారు. ఒకవేళ ఆస్తులను సర్ధుకున్నా  ఎలా సర్దుకున్నారో పబ్లిక్‌కు తెలియదని, అది ప్రైవేట్ మేటర్ అని అన్నారు. 

హిస్టరీలో ఖరీదైన విడాకులు..జెఫ్‌ బెజోస్‌-మెకెంజీ బెజోస్‌
అమెజాన్‌ ఫౌండర్ జెఫ్‌ బెజోస్‌ తన మాజీ భార్యకు భరణం కింద రూ. రెండు లక్షల కోట్లు చెల్లించారు. అమెజాన్‌లో 4 శాతం వాటాను ఆమెకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వాటా సుమారు 36 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని మెకెంజీకి ఇచ్చేసినా, ఆ తర్వాత కూడా జెఫ్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగగలిగారు. మరోవైపు మెకెంజీ కూడా గ్లోబల్‌గా అత్యంత మహిళా  ధనవంతుల్లో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం జెఫ్‌ బెజోస్‌ సంపద 197 బిలియన్ డాలర్లు కాగా, ఆమె సంపద 61 బిలియన్‌ డాలర్లు. 
రూ. 9,620 కోట్లు చెల్లించిన పిమ్కో ఏఎంయూ ఫౌండర్‌‌ 
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పిమ్కో ఫౌండర్ బిల్‌ గ్రాస్‌, ఆయన భార్య సూ గ్రాస్‌లు 2016 లో విడిపోయారు.  సూ గ్రాస్‌కు  భరణం కింద 1.3 బిలియన్ డాలర్లు(రూ.9,620 కోట్లు) అందాయని వార్తలొచ్చాయి. దీంతో పాటు 36 మిలియన్ డాలర్ల విలువైన బీచ్ హౌస్‌, 35 మిలియన్‌ డాలర్ల విలువైన పికాసో పెయింటింగ్‌ ఒకటి ఆమె పొందింది.