అలలపై బిల్‌గేట్స్ స్వర్గం
రూ.4,600 కోట్లతో సూపర్‌యాట్
తయారు చేయిస్తున్న రెండో కుబేరుడు
సకల భోగాలకు కేరాఫ్ స్వర్గం. ఆ స్వర్గం నీళ్లపైకి వస్తే ఎట్లుంటది..? ఇదిగో ప్రపంచపు రెండో కుబేరుడు బిల్‌గేట్స్ తయారు చేయిస్తున్న ఈ సూపర్యాట్లా ఉంటుంది. బాడీ ఫిట్‌గా ఉండేందుకు జిమ్, యోగా స్టూడియో, అందంగా ముస్తాబవడానికి బ్యూటీ పార్లర్, ఒంటికి నీటితో చేసే హైడ్రో మసాజ్ రూమ్, విశాలమైన స్పేస్.. ఒక్కటేమిటి సకల హంగులతో రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతున్న ఈ యాట్ పేరు ఆక్వా. 370 అడుగుల పొడవు, ఐదు డెక్కులతో ముందుకు సాగే ఈ యాట్‌కు బిల్‌గేట్స్ పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4,613 కోట్లు (64.5 కోట్ల డాలర్లు). దీంట్లో ఇంకో స్పెషాలిటీ.. వాతావరణానికి ఏ మాత్రం హాని చేయని ఇంధనం వాడడం. అవును, పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుందీ యాట్. దాని వల్ల సముద్రంలోకి నీళ్లు తప్ప వేరే ఏ హానికారక కాలుష్య కణాలు విడుదల కావు. –253 డిగ్రీల టెంపరేచర్ వద్ద 28 టన్నుల రెండు వాక్యూమ్ సీల్డ్ ట్యాంకుల్లో హైడ్రోజన్ ఇంధనాన్ని నింపుతారు. ఒక్కసారి రెండు ట్యాంకులు ఫుల్ చేస్తే ఏకంగా 6,035 కిలోమీటర్లు వెళుతుంది. 17 నాట్ల వేగంతో దూసుకెళుతుంది. గత ఏడాది మొనాకో యాట్ ఫెస్టివల్లో ఆక్వా ప్రొటోటైప్‌ను ప్రదర్శించారు. అప్పుడే గేట్స్ దానికి ఓకే చెప్పారు.
2024లో సంద్రంలోకి ఎంట్రీ
శాండర్ సైనట్ అనే డిజైనర్ దానికి రూపునిస్తే, లేటరల్ నేవల్ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ దానిని తయారు చేయబోతోంది. అయితే, ఇప్పుడప్పుడే అది సముద్రంలోకి వెళ్లదు. అది తన జర్నీ మొదలుపెట్టాలంటే 2024 వరకు ఆగాల్సిందే. సూపర్ యాట్ ఇండస్ట్రీలో ఆక్వా ఓ మైలురాయిగా నిలుస్తుందని అటు బిల్‌గేట్స్, ఇటు సైటన్ చెబుతున్నారు. 14 మంది గెస్టులు, 31 మంది సిబ్బందికి ఇందులో చోటు ఉంటుంది. గెస్టుల కోసం 4 గెస్ట్ స్టేట్ రూములు, 2 వీఐపీ రూములు, ఓనర్‌కు ఒక స్పెషల్ పెవిలియన్ ఉంటాయి. సిబ్బంది కోసం 14 డబుల్ క్రూ క్యాబిన్స్, రెండు ఆఫీసర్ క్యాబిన్లు, కెప్టెన్‌కు ఒక క్యాబిన్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే డీజిల్ కాకుండా వేరే ఇంధనాలకు సంబంధించిన టెక్నాలజీలపై బిల్‌గేట్స్ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ఒకటి కాలిఫోర్నియాలో కడుతున్న హీలియోజెన్ ప్రాజెక్ట్. హైడ్రోజన్ ఇంధనాన్ని పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో కాకుండా సోలార్ పవర్‌తో తయారు చేసే ప్రాజెక్ట్ అది.

