హెల్త్, క్లైమేట్, అభివృద్ధిలో ఇండియా భేష్

 హెల్త్, క్లైమేట్, అభివృద్ధిలో ఇండియా భేష్

న్యూఢిల్లీ: హెల్త్, క్లైమేట్, అభివృద్ధిలో ఇండియా సాధిస్తున్న ప్రగతి చాలా బాగుందని మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ అన్నారు. ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇండియా చేసి  చూపిందన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ ఇంతటి ఆశాజనకమైన ప్రగతిని తాను చూడలేదన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన బిల్ గేట్స్ దేశంలో హెల్త్ సెక్టార్, క్లైమేట్ చేంజ్, ఇండియా జీ20 ప్రెసిడెన్సీ, తదితర అంశాలపై చర్చించారు. మోడీతో తాను చర్చించిన అంశాల గురించి ఆయన తన అఫీషియల్ బ్లాగ్ ‘గేట్స్ నోట్స్’లో వివరంగా రాశారు. కరోనా విపత్తు సమయంలో ఇండియా లక్షలాది డోసుల టీకాలను ఉత్పత్తి చేసి, ప్రపంచానికి అందించిందన్నారు. అనేక దేశాల్లో లక్షలాది ప్రాణాలను కాపాడిన ఈ కార్యక్రమంలో తన గేట్స్ ఫౌండేషన్ కూడా పాలుపంచుకుందని తెలిపారు.

దేశ ప్రజలకు 220 కోట్ల డోసుల టీకాలను అందించారని, కోట్లాది మందికి అపాయింట్మెంట్లు, టీకాల పంపిణీ కోసం కొవిన్ పోర్టల్ ను వినియోగించుకోవడం అద్భుతమన్నారు. కొవిన్ పోర్టల్ ప్రపంచానికి ఒక మోడల్ అని మోడీ అన్నారని, ఆయన మాటలను ఒప్పుకుంటున్నానని చెప్పారు. కరోనా టైంలో ఇండియా డిజిటల్ చెల్లింపులను ఆశ్రయించడంపై కూడా ప్రశంసలు కురిపించారు. కనీసం 30 కోట్ల మంది ఎమర్జెన్సీలో డిజిటల్ పేమెంట్స్ పొందారని, ఇందులో 20 కోట్ల మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఇండియాలో డిజిటల్ ఐడీ సిస్టం(ఆధార్), డిజిటల్ బ్యాంకింగ్ కోసం ప్రత్యేక ప్లాట్ ఫామ్​లను 
తేవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

‘గతి శక్తి’తో స్పీడ్ గా పనులు 

డిజిటల్ టెక్నాలజీ సాయంతో ప్రభుత్వాలు ఎంత బాగా పనిచేయగలవో అన్నదానికి ‘గతి శక్తి’ ప్రోగ్రాం ఒక నిదర్శనమని బిల్ గేట్స్ అన్నారు. ‘‘ఇది డిజిటల్ గా రైల్వే, రోడ్స్ సహా 16 మినిస్ట్రీలను కలుపుతుంది. దీని సాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విషయంలో అన్ని శాఖలు కలిసి మంచి ప్రణాళిక, సమన్వయంతో పనిచేస్తాయి. ఫలితంగా సైంటిస్టులు, ఇంజనీర్లు పనిని ఫాస్ట్​గా పూర్తి చేయొచ్చు” అని ఆయన వివరించారు. దేశంలో అభివృద్ధిచేసిన ఇన్నోవేషన్స్​తో ప్రపంచానికి కలిగే ఉపయోగం గురించి తెలియజేసేందుకు జీ20 ప్రెసిడెన్సీ మంచి అవకాశమన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ ఐడీ, పేమెంట్స్ సిస్టంలను ఇతర దేశాలకు పరిచయం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇండియా ఇలాగే ప్రగతి పథంలో పయనించాలని, తన ఇన్నోవేషన్లను ఇలాగే ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.