
కరోనా వైరస్ ( కోవిడ్ – 19) ను కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కొనియాడారు. మోడీ నాయకత్వంలో.. కరోనాను భారత్ అద్భుతంగా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ఇందుకు గాను … మోడీకి ఆయన లెటర్ రాశారు. మీ నాయకత్వంలో కరోనాను చాలా బాగా కట్టడి చేస్తున్నారని… వైరస్ వ్యాపిస్తుందన్న దశలోనే లాక్ డౌన్ విధించారని.. దీంతో పాటు లాక్ డౌన్ ను పొడిగించారని అందుకే భారత్ లో తక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.
కరోనా వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించి హాట్ స్పాట్ లుగా తొందరగా ప్రకటించారని.. క్వారెంటెన్ లపై తీసుకున్న ఫాస్ట్ నిర్ణయాలు భారత్ ను సేఫ్ ప్లేస్ లో ఉంచాయని అన్నారు బిల్ గేట్స్. ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు చేశారని.. దీంతో పాటు డిజిటల్ టెక్నాలజీని ఇందులో భాగం చేశారని… ఆరోగ్య సేతు యాప్ ను లాంచ్ చేసి కరోనా కట్టడికి మరో మెట్టు ఎక్కారని అన్నారు బిల్ గేట్స్. ఈ నిర్ణయం తనను చాలా ఆనందానికి గురి చేసిందని చెప్పారు. ఆరోగ్య సేతు కరోనా వైరస్ ట్రాకింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని లెటర్ లో పేర్కొన్నారు.