
- సర్కార్ ఖజానా ఖాళీ.. నిలిచిపోయిన చెల్లింపులు
- ఎలక్షన్లు అయ్యేదాకా ఇచ్చేది కష్టమే అంటున్న ఆఫీసర్లు
- ఒకట్రెండు పెద్ద కంపెనీలకు మాత్రం బిల్లులు క్లియర్
హైదరాబాద్, వెలుగు: వివిధ డిపార్ట్ మెంట్ల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సర్కారు చెల్లించాల్సిన బిల్లులు రూ. 37 వేల కోట్లకుపైనే పేరుకుపోయాయి. ఆర్ అండ్ బీ మొదలు ఇరిగేషన్ వరకు ఏ డిపార్ట్‌మెంట్ తీసుకున్నా.. ఆయా శాఖల్లో చేపట్టిన పనులకు చెల్లింపులు చేయడం లేదు. ‘‘ఇప్పటివరకు ఏదైనా పైరవీ చేసుకుంటే కానీ ఆడపాదడపా బిల్లులు రిలీజ్ అయ్యేవి కావు. ఇప్పుడు ఎవరు చెప్పినా లాభం ఉండటం లేదు” అంటూ కాంట్రాక్టర్ల మధ్య చర్చ జరుగుతోంది.
సర్కార్ ఖజానా ఖాళీ కావడంతో ఎలక్షన్లు అయ్యేదాకా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కష్టమేనని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని పనులు ఆగిపోగా.. మిగతా చోట్ల పనులు ఆపే యోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్లు తెలిసింది. సర్కార్ పెద్దలకు సన్నిహితంగా ఉన్న ఒకటి రెండు పెద్ద కంపెనీలు చేపట్టిన పనులకు ఏ ఇబ్బంది లేకుండా బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయని చెప్తున్నారు.
ఇరిగేషన్‌లోనే రూ. 20 వేల కోట్లు..
ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే రూ.20 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇసుక క్వారీలకు సంబంధించి రూ.700 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రాజెక్టులు, మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల విస్తరణ, కాల్వల కోసం సేకరించిన భూములకు మూడు నాలుగేండ్లుగా పరిహారం చెల్లించడం లేదు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల బిల్లులు రూ.2,500 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిసింది. దీంతో కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలూ అందడం లేదు. మున్సిపల్(పబ్లిక్ హెల్త్) శాఖ, జీహెచ్‌ఎంసీ బిల్లులూ రూ.4,450 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్ అండ్ బీలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం, సెక్రటేరియేట్‌తో పాటు రోడ్లు ఇతర పనులకు సంబంధించి రూ.4,500 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. పంచాయతీరాజ్‌లో రూ.2,700 కోట్లు, ఇతర డిపార్ట్మెంట్లలో రూ.2,500 కోట్లు ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇలా అన్నీ కలిపితే రూ.37 వేల కోట్లు దాటుతాయని అంటున్నారు.
కొత్తగా అప్పులు పుట్టట్లే
ఖాజానాలో పైసలు లేకపోవడం.. కార్పొరేషన్లకు అప్పులు పుట్టకపోవడంతో కాంట్రాక్టర్లకు సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. ఆర్బీఐ నుంచి తీసుకుంటున్న రెగ్యులర్ అప్పుల్లో కొంత వెల్ఫేర్ స్కీంలకు ఇస్తోంది. దీంతో సాగునీటి ప్రాజెక్టులతో పాటు వివిధ దశల్లో ఉన్న ప్రభుత్వ నిర్మాణాల పనులు ఆగిపోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రూ.11 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటికే అప్పులకు బ్రేక్ పడటంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు సాగడం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇతర నిర్మాణాలు కూడా అప్పులు రిలీజ్ కావడంపైనే ఆధారపడి ఉన్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవాలంటే చెల్లింపులు ఎలా చేస్తారనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వమే బడ్జెట్ నుంచి ఇస్తానని అంటే.. ఆ అప్పును ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లెక్కిస్తారు. దీంతో అప్పులు తిరిగి కట్టడంపై క్లారిటీ లేక ఎక్కడికక్కడ అప్పులు పుట్టడం ఆగిపోయింది. సర్కారు గ్యారంటీ విషయంలో సరైన ప్రపోజల్స్ లేకపోవడం వల్లే ఇటీవల టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌కు రూ.10 వేల కోట్ల అప్పు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఎలక్షన్లు అయ్యేదాకా ఇచ్చేది డౌటే
ఎన్నికలు అయ్యేవరకు బిల్లులు రిలీజ్ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ఖాజానా ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకే నిధులు ఇవ్వడం కష్టంగా ఉన్నదని.. ఇక కాంట్రాక్టర్ల బిల్లులు ఎట్లా చెల్లిస్తామని ఆఫీసర్లు అంటున్నారు. ఇంకో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న వెల్ఫేర్ స్కీములకు ఎంతోకొంత నిధులు సర్దుబాటు చేయాలని.. ఇతరత్రా వేటినీ పట్టించుకోవద్దని ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలిసింది.