ఫస్ట్ నుంచి కాలేజీ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్

ఫస్ట్ నుంచి కాలేజీ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్
  •    బీటెక్​లో 89,400 సీట్లకు ప్రైవేటు కాలేజీల దరఖాస్తు 
  •    జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి 


వచ్చే నెల ఫస్ట్ నుంచి అన్ని టెక్నికల్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తామని జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి చెప్పారు. రూల్స్​ ప్రకారం సిబ్బందికి మేనేజ్​మెంట్లు జీతాలివ్వాల్సిందేనని అన్నారు. మేనేజ్​మెంట్లు జీతాలిచ్చి వెనక్కి తీసుకుంటున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీంతో ప్రస్తుతం కాలేజీల నుంచి తీసుకున్న శాలరీ డీటెయిల్స్​ను(ఫామ్16) ఐటీ శా ఖకు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం జేఎన్టీయూహెచ్​లో విలేకరులతో మాట్లాడారు. జేఎన్టీయూహెచ్​పరిధిలో 2021–22 అకడమిక్ ఇయర్​లో మొత్తం 232 ప్రైవేటు టెక్నికల్, ప్రొఫెషనల్ కాలేజీలు అఫిలియేషన్​కు దరఖాస్తు చేశాయని చెప్పారు. వీటిలో 148 ఇంజినీరింగ్, 73 ఫార్మసీ, 11 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నట్టు వెల్లడించారు. నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు లెటర్ పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది బీటెక్​లో 89,400 సీట్లు, బీఫార్మసీలో 6,940, ఎంటెక్​లో 6,258, ఎంఫార్మసీలో 3,036, ఎంబీఏలో 10,125, ఎంసీఏలో 180, ఫార్మాడీలో 1,320, ఫార్మాడీ(పీబీ)లో 180 సీట్లకు కాలేజీలు అప్లై చేసుకున్నాయని తెలిపారు. అయితే కాలేజీల్లో తనిఖీలు జరుగుతున్నాయని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా కాలేజీల్లో ఫెసిలిటీస్​కు అనుగుణంగా సీట్ల అలాట్​మెంట్​చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 5 వేల మంది లెక్చరర్ల రాటిఫికేషన్​ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. త్వరలో ఈ విధానానికి స్వస్తి చెప్పి అర్హత పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు.