
- అలంకారప్రాయంగా బయో మెట్రిక్
- రిజిస్టర్లలోనే ఉద్యోగుల హాజరు నమోదు
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి టెంపుల్లో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలకు రావడం.. కొన్నిసార్లు మొత్తానికే డుమ్మా కొట్టడం పరిపాటి అయ్యింది. తమకు తీరినప్పుడు వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఈ వ్యవహారం సజావుగా సాగడానికి అటెండెన్స్ నమోదు కోసం ఆలయానికి పంపిన బయోమెట్రిక్మెషిన్ను మూలన పడేశారు. ఇన్‌టైమ్‌లో ఇచ్చి బయో మెట్రిక్ పై వేలి ముద్రలు వేయడం ద్వారా హాజరు వేయించుకోవాలి.
ప్రతి నెల జీతాలు ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజరు పరిశీలించాలి, కానీ అధికారులు కూడా అటెండెన్స్ రిజిష్టర్ ఆధారంగా జీతాల బిల్లులు తయారు చేస్తున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి ఐదు రోజులు డ్యూటీకి రాకుండానే రిజిష్టర్ లో సంతకాలు చేసి జీతం తీసుకున్నాడు. ఇది తెలిసి ఉన్నతాధికారులు మందలించినా సిబ్బంది తీరు మారలేదు. ఇప్పటికీ ఆలయ ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని పాటించడంలేదు.
ఏడాది కిందే బయోమెట్రిక్ ..
మల్లన్న ఆలయంలో ఉద్యోగుల బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు ఏడాది క్రితం ప్రారంభమైంది. అంతకుముందు అటెండెన్స్ విషయంలో కొందరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెల్లడంతో గత ఏడాది జూలై నెల నుంచి బయో మెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. కొమురవెల్లి దేవస్థానంలో ప్రస్తుతం వివిధ హోదాల్లో 22 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 25 మంది పూజారులు, 30 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 62 మంది పారిశుధ్య కార్మికులు డైలీవేజ్ బెసిస్పై పనిచేస్తున్నారు. వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు, పూజారులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది బయో మెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిఉంది. కానీ ఉద్యోగులు ఇంకా రిజిస్టర్లోనే సంతకాలు చేస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
ఆలయంలో పని చేస్తున్న 30 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. వీరికి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ప్రతి నెల రూ.6 లక్షలు జీతాలు చెల్లించాల్సిఉంది. హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికుల వేతనాలకు సంబంధించి జీఎస్టీ చెల్లించకపోవడంతో పాటు వారికి సంబంధించిన ఈఎస్ఐ,ఈ పీఎఫ్ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా కాజేసింది. జీఎస్టీకి సంబంధించి 14 లక్షలు, ఈఎస్ఐ డబ్బులు11 లక్షలు, ఈపీఎస్ సొమ్ము 3 లక్షలు స్వాహా చేసినట్టు తేలింది. దీంతో ఆఏజెన్సీ కాంట్రాక్ట్‌ను ఆలయ అధికారులు రద్దు చేశారు. కొత్త ఏజెన్సీని నియమించడానికి ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో వారి వేతనాల పంపిణీ నిలిచిపోయింది.
బయో మెట్రిక్ ద్వారానే వేతనాలు
కొమురవెల్లి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది బయో మెట్రిక్ హాజరును పరిశీలించిన తరువాతనే వేతనాలు ఇస్తున్నాం. హాజరు నమోదు లో అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తాం. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమీషనర్ కు ప్రతిపాదనలు పంపాం. – అన్నపూర్ణ, ఆలయ ఈఓ