
హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని, డ్యూటీ సమయంలో డాక్టర్లు, సిబ్బంది తప్పకుండా దవాఖాన్లలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హాజరు వేస్తున్నదెవరో తెలుసుకోవడం కోసం, బయోమెట్రిక్ మిషన్లు ఉన్న ప్రతి చోటా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు.
ఇన్ అండ్ అవుట్ హాజరును నమోదు చేయాలని చెప్పారు. ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు నెలకు కనీసం రెండు సార్లు తమ పరిధిలోని హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. దవాఖాన్లలో సిబ్బంది హాజరు, ఎక్విప్మెంట్లు, మందులు, పారిశుధ్యం, డైట్ వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఏవైనా లోపాలను గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని, ఇంకేమైనా సౌలతులు అవసరమైతే తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలోని డైట్ క్యాంటీన్లను కూడా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. సర్కారు దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో మందులు రెడీగా ఉంచుకోవాలన్నారు.
ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక ఫోకస్..
గిరిజన ప్రాంతాల్లోని గర్భిణుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈడీడీ (ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్) వివరాలతో ఓ క్యాలెండర్ మెయింటైన్ చేయాలని చెప్పారు. ట్రైబల్ ఏరియాల్లో ఉన్న గర్భిణులను ఈడీడీ కంటే వారం, పది రోజుల ముందే హాస్పిటల్‌కు తరలించి, బర్త్ వెయిటింగ్ రూమ్స్ అలాట్ చేయాలన్నారు. ఈ వెయిటింగ్ రూముల్లో ఉన్న గర్భిణులకు, వారి అటెండర్లకు భోజనం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని 4 ఐటీడీఏల పరిధిలో ఉన్న హాస్పిటళ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలన్నారు.
ట్రైబల్ ఏరియాలో అంబులెన్స్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇకపై జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, టాస్క్‌ఫోర్స్ కమిటీలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని, అన్ని వివరాలతో హాజరుకావాలని మంత్రి సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్ పాల్గొన్నారు.