మోడీ బయోపిక్‌ చూసి నిర్ణయం తీసుకోండి: ECకి సుప్రీం సూచన

మోడీ బయోపిక్‌ చూసి నిర్ణయం తీసుకోండి: ECకి సుప్రీం సూచన

మోడీ బయోపిక్ రిలీజ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సినిమాపై నిషేధాన్ని తొలగించాలంటూ నిర్మాతలు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. నిషేధంపై నిర్ణయం తీసుకునే విషయంలో ఈసీకి సుప్రీంకోర్టు సూచనలు చేసింది.

ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు చిత్రాన్ని చూశారా అని ప్రశ్నించింది సుప్రీం. ఈసీ ప్రతినిధుల కోసం ప్రధాని మెడీ  సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని నిర్మాతలను ఆదేశించింది. సినిమా చూసిన తర్వాత బ్యాన్ ఎత్తివేసే విషయంలో నిర్ణయానికి రావాలని ఈసీకి సూచించింది. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఏప్రిల్ 22లోగా సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని మోడీ జీవితగాథ ఆధారంగా పీఎం నరేంద్రమోడీ మూవీని తెరకెక్కింది. అయితే ఎన్నికల సమయంలో సినిమా రిలీజ్ చేస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందంటూ కాంగ్రెస్ గతంలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం సినిమా రిలీజ్‌పై నిషేధం విధించే విషయంలో నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి వదిలేసింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ చేయవద్దని ఆదేశించింది. ఈసీ ఉత్తర్వులపై  ఆ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.