పిల్లల్ని కనాలంటూ ప్రజలకు ఆఫర్లిస్తున్న దేశం

పిల్లల్ని కనాలంటూ ప్రజలకు ఆఫర్లిస్తున్న దేశం

జనాభాను తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ వంటి పథకాల గురించి విన్నాం. ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని చెప్తూ.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎదురయ్యే ఇబ్బందులేవో ప్రకటనల్లో చూశాం. కానీ పిల్లల్ని కంటే బోనస్​ ఇస్తామంటూ ఎంకరేజ్​ చేసే పథకాల గురించి ఎప్పుడైనా విన్నారా?

ఈ హెడ్డింగ్​ చదివి.. వెంటనే పెళ్లి చేసుకొని, అర్జెంటుగా పిల్లల్ని కనాలని డిసైడవ్వకండి. ఎందుకంటే ఈ ఆఫర్​ మనదేశంలో కాదు. జననాల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్న ఫిన్లాండ్​ దేశంలోని ఓ లోకల్​ బాడీ(మున్సిపల్​ కార్పొరేషన్​ లాంటిది) ఈ పథకాన్ని ప్రకటించింది. పిల్లల్ని కన్న తల్లిదండ్రులకే కాదు, పుట్టిన పిల్లలకు కూడా పలు ఆఫర్లు ప్రకటించింది.

జనాభాను తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ వంటి పథకాల గురించి విన్నాం. ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని చెప్తూ.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎదురయ్యే ఇబ్బందులేవో ప్రకటనల్లో చూశాం. కానీ పిల్లల్ని కంటే బోనస్​ ఇస్తామంటూ ఎంకరేజ్​ చేసే పథకాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇండియా​, చైనావంటి దేశాల్లో జనాభా పెరిగిపోతున్నందున జనాభా నియంత్రణ పథకాలను ప్రకటిస్తారు. కానీ.. యూరప్​ కంట్రీస్​లో జనాభా చాలా తక్కువ. మనదగ్గర ఒక్క నగరంలో ఉండే జనాభా అక్కడ దేశం మొత్తం కలిపినా ఉండదు. అందుకే అక్కడి ప్రభుత్వాలు పిల్లల్ని కన్నవారికి రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఫిన్లాండ్ ప్రావిన్స్​లోని లెస్టిజార్వి మున్సిపాలిటీ కూడా ఓ పథకాన్ని ప్రకటించింది.

పదివేల యూరోలు..

లెస్టిజార్వి అనే ఆ ఊరి జనాభా కేవలం 725 మంది మాత్రమే. 2012లో కేవలం ఒకే ఒక్క పాపాయి పుట్టింది. దీంతో ఆ ఊరి జనాభాను పెంచేందుకు 2013లో లెస్టిజార్వి మున్సిపాలిటీ ‘బేబీ బోనస్​’ పేరుతో పథకాన్ని ప్రకటించింది. ఆ ఊరిలో పిల్లల్ని కని, నివసించేవారికి బోనస్​ రూపంలో 10,000 యూరోలు అందజేస్తామని ప్రకటించింది. భారత కరెన్సీలో దాదాపు 8 లక్షల రూపాయలన్నమాట. ఏటా వెయ్యి యూరోల చొప్పున పది సంవత్సరాలపాటు బిడ్డకు పేరెంట్స్​కు బోనస్​ చెల్లిస్తారు.

జననాల సంఖ్య డబుల్​..

ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏడేళ్లలో ఇక్కడ 60 మంది పిల్లలు పుట్టారు. అంతకు ముందు ఏడేళ్లలో 38 మంది మాత్రమే పుట్టారట. అంటే, ఆ బోనస్ పథకం ఎంతో కొంత ఫలించిందని అధికారులు చెబుతున్నారు.

50 ఏళ్లు దాటినా..

‘బేబీ బోనస్​’ పథకం ప్రకటించిన తర్వాత జుక్కా- పెక్కా టుయిక్కా, జనికా దంపతులు అందరికంటే ముందుగా బోనస్​

అందుకున్నారు. అయితే జుక్కా వయసు 50 ఏళ్లు కాగా, జనికా వయసు 48 ఏళ్లు. వీరిద్దరికి 2013లో ఓ బిడ్డ పుట్టింది. దీంతో ఆ అమ్మాయిని అంతా ‘టెన్​ థౌజెండ్​ యూరో గర్ల్​’ అని పిలుస్తున్నారు. ఈ జంట ఇప్పటిదాకా 6000 యూరోలను బోనస్​గా అందుకుంది.

మరికొన్ని మున్సిపాలిటీల్లో పథకం..

లెస్టిజార్వి మున్సిపాలిటీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం సక్సెస్​ కావడంతో ఫిన్లాండ్​లోని మిగతా మున్సిపాలిటీలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇచ్చే బోనస్​ మొత్తంలో తేడా ఉన్నా.. ‘బేబీ బోనస్​’ను పోలిన పథకాలను ప్రవేశపెడుతున్నాయి.

పదేళ్ల కిందటి కంటే తగ్గిన జననాల రేటు..

ఫిన్లాండ్​ దేశం 2018లో ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం.. ప్రతి మహిళకు సగటున 1.4 చొప్పున చిన్నారులన్నారు. అంటే సగటున ఇద్దరు పిల్లలు కూడా లేరు. పదేళ్ల కిందట సగటున ప్రతి జంటకు ఇద్దరు, అంతకంటే ఎక్కువ పిల్లలుండేవారు. కానీ ఇటీవల కాలంలో తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కన్నందుకే కాదు.. పెంచేందుకు కూడా..

ఫిన్లాండ్‌‌‌‌లో జననాల పెరుగుదల, పిల్లల పోషణ కోసం ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. బేబీ బాక్స్​ల పంపిణీ, ఒక్కో చిన్నారికి నెలనెలా దాదాపు 100 యూరోలు (రూ. 7,865) ఇవ్వడం, 70 శాతం వేతనంతో కూడిన 9 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వడం వంటి పథకాలు అమలు చేస్తున్నారు.

యూరప్​లోని మిగతా దేశాల్లోనూ..

యూరప్‌‌లోని మరికొన్ని దేశాల్లో కూడా ఇటువంటి పథకాలు అమలవుతున్నాయి. ఎస్తోనియా కంట్రీ 2017లో పిల్లలకు నెలనెలా ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించింది.

ఇక్కడ మొదటి బిడ్డకు 60 యూరోలు (రూ.4,724), రెండో బిడ్డకు 60 యూరోలు (రూ.4,724), మూడో బిడ్డకు 100 యూరోలు (రూ. 7,867) చొప్పున ప్రతి నెలా ఇస్తున్నారు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఎస్తోనియా ప్రభుత్వం అదనపు బహుమతులు కూడా ఇస్తోంది. ఆ కుటుంబాలకు నెలవారీ బోనస్‌‌గా 300 యూరోలు (రూ.23,619) చెల్లిస్తుంది. అలా ముగ్గురు పిల్లలు ఉన్న ఒక్కో కుటుంబం నెలానెలా 520 యూరోలు (రూ.40,920) అందుకుంటోంది.

డబ్బిస్తామంటే ఎవరు వద్దంటారు..

ఫిన్లాండ్​ వంటి పేద దేశంలో ప్రజల ఆదాయం​ కూడా తక్కువే. అందుకే ప్రభుత్వం ప్రకటించే ఇలాంటి పథకాల కోసం పిల్లల్ని కనేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోందని సర్వేల్లో తేలింది. 2010తో పోలిస్తే 2018 నాటికి జననాల రేటు 1.32 నుంచి 1.67కు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న బోనస్​ వంటి పథకాలు సక్సెస్​ అవుతున్నాయని టాలిన్​ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లాన్ ప్యూర్ అభిప్రాయపడ్డారు. మూడో బిడ్డను కన్నవారికి ప్రత్యేక బహుమతి ఇచ్చే పథకం ఎక్కువ ప్రభావం చూపినట్లు తన స్టడీలో తేలిందన్నారు.

ఇలాంటి కానుకలతో జననాల రేటును పెంచవచ్చునని ఇటలీలో ఇటీవల ఒక స్టడీలో వెల్లడైంది. ఇటలీలో జననాల రేటు ఎన్నో ఏళ్లుగా చాలా తక్కువగా నమోదవుతోంది. 2018లో మరింతగా తగ్గింది. దీంతో ఫైనాన్షియల్​గా బెనిఫిట్​ కలిగించే ఇలాంటి పథకాలను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం కూడా అనుకుంటోంది. అయితే డబ్బు జననాలను పెంచుతుందా? లేదా? అనే విషయమై నివేదిక ఇవ్వాలంటూ ఫిన్లాండ్​కు ఓ టీమ్​ను కూడా పంపింది.