అధికారుల నిర్లక్ష్యం: బర్త్, డెత్ ​సర్టిఫికెట్లు ఇయ్యట్లే!

అధికారుల నిర్లక్ష్యం: బర్త్, డెత్ ​సర్టిఫికెట్లు ఇయ్యట్లే!

సర్టిఫికెట్ల కోసం 50 వేల మంది వెయిటింగ్
 7 రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నా నెలల తరబడి లేట్​
  జనం ఆఫీసులకు వెళ్తే అధికారుల నో రెస్పాన్స్​

సంగారెడ్డి జిల్లాకు చెందిన రామన్న అనే వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​తీసుకుంటూ నెలన్నర కిందట చనిపోయాడు. డెడ్​బాడీ తీసుకెళ్లే సమయంలో కుటుంబ సభ్యులకు ఆస్పత్రిలో స్లిప్​ఇవ్వకపోవడంతో డెత్ సర్టిఫికెట్​ఎక్కడ తీసుకోవాలో తెలియడం లేదు. సర్దార్​మహల్​లోని బల్దియా ఆఫీసుకు వెళ్లి అడిగితే వివరాలు ఇంకా రాలేదని సమాధానం ఇచ్చారు. మృతుడికి రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తాయి. డెత్ సర్టిఫికెట్​రాక బీమా కోసం కూడా అప్లై చేయలేదు.’’
వికారాబాద్ జిల్లాకు చెందిన గోవర్ధన్ కు రెండు నెలల కిందట కరోనా సోకగా సిటీలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో ట్రీట్ మెంట్​తీసుకుంటూ చనిపోయాడు.  ఇప్పటికీ డెత్​సర్టిఫికెట్​జారీ కాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లి అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. అటు హాస్పిటల్​లో , ఇటు బల్దియా ఆఫీసర్లను సంప్రదించినా సర్టిఫికెట్​మాత్రం ఇంకా అందలేదు.’’
హైదరాబాద్​, వెలుగు: బర్త్, డెత్​సర్టిఫికెట్ల జారీలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తోంది. సర్కిల్​ ఆఫీసుల చుట్టూ నెలలుగా సిటిజన్స్​ తిరుగుతున్నారు. అధికారులను, సిబ్బందిని అడిగితే సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ మెడికల్​ఆఫీసర్ల పరిధిలో ఉంటుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్​పైనే బల్దియా ఫోకస్​పెట్టింది. దీంతో వీరంతా వ్యాక్సినేషన్ డ్రైవ్ బిజీలో ఉండడంతో మరింత లేట్అయ్యేలా ఉంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 30 సర్కిళ్లలో దాదాపు 4  నెలలుగా 50 వేల వరకు బర్త్, డెత్​సర్టిఫికెట్లు పెండింగ్​లో ఉన్నాయి.   ఖైరతాబాద్​, సికింద్రాబాద్​ సర్కిళ్లలోనే ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్​పూర్తయ్యే సరికి పెండింగ్​ అప్లికేషన్ల సంఖ్య డబుల్​అయ్యేలా ఉంది. కరోనా, ఇతర కారణాలతో ఆస్పత్రుల్లో చనిపోయిన వారికి, సాధారణ మరణాలకు కూడా డెత్​సర్టిఫికెట్లు రావడడం చాలా కష్టంగా మారింది.  లాక్ డౌన్ కావడంతో రాకపోకలు కూడా సరిగా లేవు. అధికారులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. 
మళ్లీ రావాలంటూ తిప్పి పంపుతూ..
లాక్ డౌన్ రిలాక్సేషన్​సమయం మధ్యాహ్నం 1 గంట వరకు ఉండడంతో  సర్టిఫికెట్ల కోసం బల్దియా సర్కిల్ ఆఫీసులకు జనం వెళ్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇండ్లకు వెళ్లిపోవాలని చూసుకుంటున్నా రు. అయినా పనులు పూర్తి కావడం లేదు. సిబ్బంది మాత్రం 10 తర్వాతనే ఆఫీసులకు వస్తున్నారు. ఆ తర్వాత కూడా పని చేయడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సిబ్బంది అంతా అక్కడే ఉన్నారని మళ్లీ రావాలంటూ తిప్పి పంపుతున్నారని, నెలల తరబడి తిరగాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ అప్లై చేసుకుంటే 7 రోజుల్లోగా క్లియర్ చేయాల్సి ఉంది. 20 రోజులైనా చేయడం లేదు.  అధికారులను అడిగితే పాత అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. స్టాఫ్ అంతా వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో ఉన్నారని తర్వాత రావాలని ఖైరతాబాద్​సర్కిల్​ఆఫీసుకి వస్తున్న వారికి స్టాఫ్ సూచిస్తున్నారు.
వ్యాక్సిన్​ డ్యూటీల్లో ఉండడంతో..
గతేడాది నుంచి ఆస్పత్రుల్లో  వందల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రేటర్​పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి ట్రీట్​మెంట్​తీసుకుంటూ చనిపోయినవారి  డెత్​సర్టిఫి కెట్లు టైమ్​కు అందక పోవడంతో కుటుంబ సభ్యులకు మరింత సమస్యగా మారింది.  బల్దియా డెత్ సర్టిఫికెట్ల జారీలో లేటు చేస్తుంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి వరకూ డెత్ సర్టిఫికెట్లను బల్దియా జారీ చేస్తుంది.  కరోనా సెకండ్ వేవ్ లో ఇది రెట్టింపు అయినట్టు అంచనా. జీహెచ్ఎంసీ పరిధిలో హెల్త్ ఆఫీసర్లు ఇతర డ్యూటీల్లో ఉండడం, సర్కిల్ ఆఫీసుల్లో ఇంటర్నెట్ ప్రాబ్లమ్​తో వెరిఫికేషన్, జారీ లేటు అవుతుంది. కొన్ని సర్కిల్​ఆఫీసుల్లోని సిస్టమ్స్  వ్యాక్సినేషన్​సెంటర్లకు తీసుకెళ్లడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం బంద్​పెట్టారు. అధికారులను అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అయితే వెంటనే సర్టిఫికెట్ ఇస్తే కరోనాతో చనిపోయిన కేసులు ఎన్నో బయటకు తెలుస్తాయనే ఉద్దేశంతోనే లేటు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వ ఆదేశాలోనే జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 
డెత్​సర్టిఫికెట్​ ఉంటేనే..
సిటీలోని ఆస్పత్రుల్లో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు.  బల్దియా జారీ చేసే డెత్ సర్టిఫికెట్ ఉంటేనే మరణించిన వ్యక్తిపై ఉండే ఆస్తులు కుటుంబ సభ్యులకు చెందుతా యి.  చివరకు మరణించిన వ్యక్తులపై ఉన్న బ్యాంకు ఖాతాలను డబ్బులు డ్రా చేసుకోవడం, ఇన్సూరెన్స్ డబ్బుల ను పొందాలన్నా డెత్ సర్టిఫికెట్ ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే వ్యక్తి మరణించి నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు రాకపోవడంతో  ఆయా బెనిఫిట్స్ అందుకోలేకపోతున్నారు. వాటిని ఎలా తీసుకోవాలో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.