పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ  రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు జగనున్నాయి. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ఈ అకాడమిక్ పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే బిట్‌ పేపర్‌(మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నపత్రం)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అదేవిధంగా జనరల్‌ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టతనిచ్చారు. 

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జనరల్‌ సైన్స్‌ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్‌ సైన్స్‌ కాగా మరొకటి బయాలాజికల్‌ సైన్స్‌. జనరల్‌ సైన్స్‌లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని తెలిపారు. రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పారు. ఇక, మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

కాగా, త్వరలోనే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు విద్యాశాఖ అధికారులు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించారు.