ఇష్టమైన వృత్తి కోసం కష్టపడి చదివాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో ఒక క్లినిక్ పెట్టుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ.. నవంకుర్ చౌదరి మాత్రం స్టెతస్కోప్‌ను పక్కన పెట్టి, బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ప్రపంచాన్ని చుట్టేందుకు బయల్దేరాడు. ట్రావెలర్ అవతారమెత్తి ‘యాత్రి డాక్టర్’గా ఫేమస్ అయ్యాడు.
నవంకుర్ చౌదరి 1996 మార్చి 2న హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌లో పుట్టాడు. స్కూలింగ్ మొత్తం అక్కడే పూర్తిచేశాడు. వైద్య వృత్తి పట్ల ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి, తక్కువటైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. నవంకుర్‌కు చిన్నప్పటినుంచి వరల్డ్ టూర్‌కి వెళ్లాలనే కోరిక ఉండేది. ఆ కోరికే అతన్ని వైద్య వృత్తికి దూరమయ్యేలా చేసింది. ఇప్పుడు ట్రావెలింగ్‌నే వృత్తిగా మార్చుకుని ప్రపంచ యాత్రికుడిగా మారిపోయాడు.
బడ్జెట్ ట్రావెల్ టిప్స్
నవంకుర్ వీడియోల్లో ముఖ్యంగా బడ్జెట్ ట్రావెల్ టిప్స్, వీసా ప్రాసెస్, లోకల్ కల్చర్, ఫుడ్, అడ్వెంచర్ అనుభవాలను ఎక్కువగా షేర్ చేస్తుంటాడు. అతను ఇప్పటివరకు అంటార్కిటికా నుంచి పిట్‌కెయిర్న్ ద్వీపాల వరకు ఎన్నో మారుమూల ప్రాంతాలను కవర్ చేసి, ట్రావెలర్స్‌కి విలువైన సమాచారం అందించాడు. ఈ మధ్యే అతను ‘యాత్రి డాక్టర్ కోర్సు’ని కూడా లాంచ్ చేశాడు. దాని ద్వారా ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లానింగ్స్‌పై ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్తున్నాడు. నవంకుర్ ఇప్పటివరకు ప్రపంచంలో గుర్తింపు పొందిన 197 దేశాల్లో 154 దేశాలకు వెళ్లాడు. అందుకే అతని బయోలో 154/197 అని రాశాడు.
►ALSO READ | మీ కుక్కలను అందంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పెట్ పైపర్స్ స్టార్టప్
యూట్యూబ్‌లోకి ఎంట్రీ
ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత తన ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 2017 సెప్టెంబర్ 20న ‘యాత్రి డాక్టర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టాడు. అందులో తన అనుభవాలు, చూసిన ప్రదేశాలను వీడియోల రూపంలో షేర్ చేస్తున్నాడు. సాధారణ ట్రావెల్ వ్లాగింగ్ వీడియోలతో ప్రారంభమైన ఈ చానెల్ చాలా తక్కువటైంలోనే పాపులర్ అయింది. ప్రస్తుతం చానెల్‌ను 1.88 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అందులో మొత్తం 904 వీడియోలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నవంకుర్‌కు బాగానే ఫాలోయింగ్ ఉంది. తన ఇన్‌స్టా పేజీని 6.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అతను కొన్నాళ్ల క్రితం ‘నవంకుర్ చౌదరి’ పేరుతో సెకండ్ చానెల్ కూడా పెట్టాడు. దానికి లక్షా 47 వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా టూర్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాడు.
వివాదాలు
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోయినేడు మేలో పాకిస్తాన్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయ్యింది. అప్పుడు సోషల్ మీడియాలో నవంకుర్పై కూడా ఆరోపణలు వచ్చాయి. దానికి కారణం.. ఆయన గతంలో పాకిస్తాన్ టూర్‌కి వెళ్లడమే. అయితే, నవంకుర్ ఆ ఆరోపణలను ఖండించాడు. ‘‘పాకిస్తాన్‌కు ఒక్కసారి మాత్రమే వెళ్లాను. నేను కేవలం ట్రావెలర్ మాత్రమే’’ అని చెప్పాడు. ఈ వివాదం తర్వాత సోషల్ మీడియాలో అతనిపై ట్రోలింగ్ పెరిగింది. అయినా, అతను మాత్రం తన కంటెంట్‌పైనే ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
