పెట్స్‌ని ముఖ్యంగా కుక్కలను పెంచుకునే వాళ్ల సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోంది. దాంతోపాటే పెట్ కేర్ మార్కెట్ కూడా ఊపందుకుంటోంది. కానీ.. పెట్స్‌ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే కొందరు గ్రూమర్లు మాత్రం వెనకబడిపోతున్నారు. ఎంతో కష్టపడి పనిచేసినా వాళ్లకు తగిన గుర్తింపు దగ్గడం లేదు. సరైన ట్రైనింగ్ లేకపోవడం వల్ల పెట్స్‌కి క్వాలిటీ సర్వీస్‌లు అందించలేకపోతున్నారు. ఇవన్నీ గమనించిన గరిమా ‘పెట్ పైపర్స్’ అనే స్టార్టప్ పెట్టింది. దీనిద్వారా గ్రూమర్లకు చేయూతని ఇవ్వడంతోపాటు పెట్స్‌కు కావాల్సిన అన్ని సర్వీస్‌లు అందిస్తోంది.
గరిమా ఖన్నా 1999లో ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో పుట్టింది. ఇది ఢిల్లీకి దగ్గరగా ఉండే ఒక చిన్న టౌన్. ఆమె చిన్నప్పటినుంచి డాగ్ లవర్. అందుకే ఇంట్లో కుక్కని పెంచుకునేది. సహరన్‌పూర్‌లో ప్రొఫెషనల్ పెట్ కేర్ సెంటర్లు లేవు. దాంతో దాని సంరక్షణ చాలా కష్టమయ్యేది. అందుకే తనే స్వయంగా బుక్స్ చదివి గ్రూమింగ్ చేయడం నేర్చుకుంది. కొన్నేండ్లకు వాళ్ల కుటుంబం ఢిల్లీ -ఎన్‌సీఆర్‌కు మారింది. అక్కడ కూడా ఆమెకు శిక్షణ పొందిన ప్రొఫెషనల్ గ్రూమర్లు దొరకలేదు. అప్పుడే ఇండియాలో ఇంకా పెట్ గ్రూమింగ్ ఇండస్ట్రీ పెద్దగా డెవలప్ కాలేదని ఆమెకు అర్థమైంది. అయితే.. ఆమె 2017లో ఒక మార్కెటింగ్ సంస్థను ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. కానీ.. తన ఆలోచనని మార్చుకుని ప్రొఫెషనల్ గ్రూమింగ్ సర్వీసెస్ అందించే స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకుంది.
మూడు సవాళ్లు..
‘‘స్టార్టప్ ఆలోచన రాగానే నేను గ్రూమింగ్ ఇండస్ట్రీపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు మూడు ముఖ్యమైన సవాళ్లను గుర్తించా. పెద్ద పెద్ద సిటీల్లో కూడా క్వాలిటీ గ్రూమింగ్ ఫెసిలిటీస్ లేవు. వయసుపై బడిన వాళ్లకు అనుకూలమైన సర్వీసులు అందించే కంపెనీలు లేవు. మరో సమస్య ఏంటంటే.. పెట్ గ్రూమింగ్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. వాళ్లకు సరైన గౌరవం కూడా దక్కడం లేదు. అందుకే ఈ మూడు సమస్యలకు పరిష్కారంగా 2019లో ‘పెట్‌పైపర్స్’ పేరుతో స్టార్టప్ పెట్టా’’ అంటూ చెప్పుకొచ్చింది గరిమా. దీనిద్వారా పెట్ పేరెంట్స్, గ్రూమర్లు.. ఇద్దరికీ లాభదాయకమైన బిజినెస్ మోడల్‌ని తయారుచేసింది.
ఇంటి దగ్గరే..
ఢిల్లీతోపాటు చాలా సిటీల్లో గ్రూమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యేకమైన వ్యాన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. అంటే వ్యాన్‌ని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి, పెట్‌ని అందులోకి తీసుకెళ్లి గ్రూమింగ్ చేస్తారు. డ్రైవర్, వ్యాన్ల మెయింటెనెన్స్ లాంటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా అలవాటుపడిన ఇంటి వాతావరణం నుంచి పెట్స్‌ని బయటకు తీసుకెళ్లడం వల్ల కొంత యాంగ్జైటికీ గురవుతాయి. అందుకే గరిమా డోర్ స్టెప్ సర్వీసులు అందించడంపై ఫోకస్ పెట్టింది. అంటే గ్రూమర్లు ఇంటికి వెళ్లి పెట్ పేరెంట్స్ ముందే వాటికి గ్రూమింగ్ చేస్తారు.
ట్రైనింగ్
ఇండియాలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేదా సర్టిఫికేషన్స్ లాంటివాటి మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. అన్ ప్రొఫెషనల్ గ్రూమర్స్ వల్ల పెట్స్‌కు గాట్లు పడడం, స్కిన్ ఇన్‌ఫెక్షన్స్, స్ట్రెస్ లాంటివి పెరుగుతున్నాయి. వాళ్లకు బ్రీడ్ స్పెసిఫిక్ నీడ్స్, యానిమల్ బిహేవియర్ గురించి తెలియకపోవడంతో గ్రూమింగ్ చేసేటప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతోంది. అందుకే గరిమా ట్రైనింగ్ మీద ఫోకస్ చేసింది. గ్రూమర్లకు 60 రోజుల స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందిస్తోంది. ట్రైనింగ్‌లో వీడియోలు చూడటం, సీనియర్లతో కలిసి పనిచేయడం, ఫీల్డ్ విజిట్స్, బ్రీడ్స్ గురించి తెలుసుకోవడం లాంటివి చేస్తారు. ఫ్రెషర్లు కొన్నాళ్లు అసిస్టెంట్‌గా పనిచేసి, స్కిల్స్ పెరిగాక ఇండిపెండెంట్‌గా పనిచేస్తారు.‘‘నా దగ్గర పనిచేసే గ్రూమర్లు పనిలో సంతోషంగా, సంతృప్తిగా ఉండేలా చూసుకోవడమే నా మొదటి లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా శాలరీ ఇస్తున్నా. అంతేకాదు.. మేం గ్రూమర్ల నుంచి క్లయింట్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటాం. వాళ్లతో అమర్యాదగా ప్రవర్తించే క్లయింట్లకు సర్వీస్ ఇచ్చేదిలేదని చెప్పేస్తాం. గ్రూమర్‌ల గౌరవం విషయంలో మాకు బేరసారాలు లేవు” అని చెప్పింది గరిమా.
►ALSO READ | ఆధ్యాత్మికం: జయ ఏకాదశి విష్ణమూర్తికి చాలా ఇష్టం..ఇలా చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది..కష్టాలు పరార్.. ..!
15 ఏండ్ల అనుభవం
పెట్‌పైపర్స్‌లో పనిచేస్తున్న ఆశిష్‌కు ఈ రంగంలో 15 ఏండ్ల అనుభవం ఉంది. గతంలో ఇతర పెట్ సెలూన్లలో పనిచేశాడు. 2018లో పెట్‌పైపర్స్‌లో చేరాడు. “గతంలో నేను చేసే పనిలో సంతృప్తి ఉండేది కాదు. జీతం కూడా చాలా తక్కువగా వచ్చేది. ఆ టైంలోనే గరిమా నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను చేరినప్పుడు నా శాలరీ రూ. 20,000. ఇప్పుడు నెలకు రూ. 55,000 తీసుకుంటున్నా. చాలా గౌరవంగా బతుకుతున్నా. కంపెనీ నుంచి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతున్నా’ అని చెప్పాడు ఆశిష్. నాలుగేండ్లలో ఆశిష్ మరో ఎనిమిది మంది గ్రూమర్లకు ట్రైనింగ్ ఇచ్చాడు. అతనే ఇప్పుడు టీంలో సీనియర్.
సరిహద్దులు దాటి..
న్యూఢిల్లీలో మూడు సంవత్సరాలు సర్వీస్‌లు అందించిన తర్వాత, 2022లో దుబాయ్‌లో రెండో బ్రాంచ్‌ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి పెట్‌పైపర్స్‌ను అంతర్జాతీయంగా విస్తరిస్తున్నారు. ఈ మధ్యే ముంబైలో కూడా బ్రాంచ్ తెరిచారు. ప్రస్తుతం ఢిల్లీలో 12, ముంబైలో 4, దుబాయ్‌లో 6 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 15 వేల మంది పెట్ పేరెంట్స్‌కు సర్వీసులు అందించారు. కేవలం ఢిల్లీలోనే 800 మంది రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారు. నెయిల్ క్లిప్పింగ్ నుంచి మెడికేటెడ్ బాత్స్ వరకు అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నారు. సర్వీస్‌ను బట్టి రూ.750 నుంచి రూ. 2,000 వరకు చార్జ్ చేస్తున్నారు.
కుక్కలంటే ప్రేమ
గతంలో ఒక కాల్ సెంటర్‌లో పనిచేసిన సుజిత్ ఆరేండ్ల క్రితం పెట్‌పైపర్స్‌లో చేరాడు. “నాకు చిన్నప్పటినుంచి కుక్కలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఒకప్పుడు నన్ను తోడేళ్ల దాడి నుంచి ఒక కుక్క కాపాడింది. కానీ.. ఆ ప్రక్రియలో అది చనిపోయింది. అప్పటినుంచి నాకు కుక్కలంటే ఇష్టం. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. పెట్ పైపర్స్‌లో రెండున్నర నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. ఇప్పుడు నెలకు 80-100 పెంపుడు పెట్స్‌కి సర్వీస్ ఇస్తున్నా.రూ. 30,000 సంపాదిస్తున్నా.
