గడ్డివాముకి కుక్క కాపలా.. స్వార్థం ఉంటే ఆకలితో మాడాల్సిందే.. ఎద్దు.. కుక్క కథ

గడ్డివాముకి కుక్క కాపలా.. స్వార్థం ఉంటే ఆకలితో మాడాల్సిందే.. ఎద్దు.. కుక్క కథ

​ఒక పల్లెటూరిలో ఓ రైతు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక కష్టపడే ఎద్దు, బద్ధకస్తురాలైన కుక్క ఉండేవి. ఎద్దు తెల్లవారినప్పటి నుంచి చీకటి పడే వరకు పొలంలో పనిచేస్తూ యజమానికి చేదోడువాదోడుగా ఉండేది. కుక్క మాత్రం యజమాని ముందు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ, లోలోపల స్వార్థంతో ప్రవర్తించేది. కుక్క వేసే వేషాలు చూసి, అది నిజంగానే తన మీద చాలా విశ్వాసంతో ఉందని నమ్మేవాడు రైతు. దానిని ఎంతో గారాబంగా చూసుకునేవాడు. 

వేసవి కాలంలో ఓ రోజు మధ్యాహ్నం ఎద్దు ఆకలి తీర్చడం కోసం పచ్చగడ్డిని కోసుకొచ్చి పశువుల కొట్టంలో వేశాడు రైతు. ఆ గడ్డిని చూడగానే కుక్కకు ఒక వింత ఆలోచన వచ్చింది. ‘‘ఈ గడ్డి ఎంతో పచ్చిగా, తేమగా ఉంది. ఎండ నుంచి కాపాడుకోవడానికి ఈ గడ్డిని ఉపయోగించుకోవాలి’’ అనుకుంది కుక్క. ఎద్దు రాకముందే వెళ్లి ఆ మెత్తని గడ్డి కుప్పపై పడుకుని హాయిగా నిద్రపోయింది. సాయంత్రం వేళకు పొలం పని ముగించుకుని, ఆకలితో అలసిపోయి వచ్చిన ఎద్దు గడ్డిని తినబోయింది. కుక్క వెంటనే నిద్రలేచి, కోపంతో పళ్లు చూపిస్తూ ఎద్దుపైకి ఎగబడి గట్టిగా మొరిగింది.

​ఆశ్చర్యపోయిన ఎద్దు ఎంతో వినయంగా, ‘‘మిత్రమా! ఇది నా ఆహారం కదా, నీకు గడ్డితో ఏం పని? నువ్వు దీన్ని తినలేవు కదా! నేను రోజంతా కష్టపడి వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. దయచేసి నన్ను తిననివ్వు’’ అని వేడుకుంది. దానికి ఆ కుక్క అహంకారంతో, ‘‘నేను తినకపోయినా పర్వాలేదు. కానీ, నిన్ను మాత్రం ముట్టుకోనివ్వను! ఇది ఇప్పుడు నా స్థావరం, ఇక్కడినుంచి వెళ్లిపో’’ అని మొండికేసింది. పాపం.. ఎద్దు ఏమీ చేయలేక ఆ రాత్రంతా ఆకలి కడుపుతో గడ్డి పక్కనే దీనంగా పడుకుంది.​

తెల్లవారగానే రైతు అక్కడికి వచ్చేసరికి, ఆకలితో నీరసించిన ఎద్దును, గడ్డి దగ్గర కాపలా కాస్తూ ఎద్దును అడ్డుకుంటున్న కుక్కను చూశాడు. కుక్క ప్రవర్తన వెనుక ఉన్న కుత్సిత బుద్ధిని రైతు వెంటనే గ్రహించాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. కుక్కకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న రైతు, దానిని తీసుకెళ్లి పెరట్లోని ఒక గుంజకు కట్టేశాడు. దానికి ఆ పూట పెట్టాల్సిన ఆహారాన్ని కూడా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి బాధతో కుక్క అల్లాడిపోయింది. అప్పుడు దానికి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. తన వల్ల ఎద్దు ఎంత  బాధపడిందో స్పష్టంగా అర్థమైంది.

​సాయంత్రం రైతు కుక్క దగ్గరకు వచ్చి, ‘‘ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకు అక్కరకు రాని గడ్డిని ఎద్దుకు అందకుండా చేయడం ఎంత తప్పో? నీకు ఇతరుల ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఇలా చేశాను’’ అని మందలించి, దానికి ఆహారం అందించాడు. కుక్క మెడకు వేసి బంధించిన గొలుసును విప్పి విడిచిపెట్టాడు. తన తప్పు తెలుసుకున్న కుక్క పరుగున ఎద్దు దగ్గరకు వెళ్లి, తల వంచుకుని క్షమాపణ కోరింది. అప్పటినుంచి కుక్క తన బద్ధకాన్ని, స్వార్థాన్ని పూర్తిగా వదిలేసింది. ఎద్దుతో స్నేహంగా ఉంటూ, రైతుకు నిజమైన విశ్వసనీయతతో సేవ చేయడం మొదలుపెట్టింది. తమకు ఉపయోగపడని వస్తువును ఇతరులకు కూడా దక్కకుండా చేసే స్వార్థపరులను ఉద్దేశించి జనం ‘‘గడ్డివాము దగ్గర కుక్క కాపలా’’ అంటుంటారు. 

-  డా. పోతగాని సత్యనారాయణ -