క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 60వేల డాలర్ల దిగువకు బిట్‌కాయిన్ పతనం.. ఎందుకంటే?

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 60వేల డాలర్ల దిగువకు బిట్‌కాయిన్ పతనం.. ఎందుకంటే?

క్రిప్టో మార్కెట్‌లో భారీ ప్రకంపనలు సృష్టిస్తూ బిట్‌కాయిన్ ధర రికార్డు స్థాయి నుండి భారీగా పతనమైంది. గ్లోబల్ మార్కెట్లో బిట్‌కాయిన్ కీలకమైన 60వేల డాలర్ల మార్కు కంటే కిందకు పడిపోయింది. యూఎస్ ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 7% నష్టపోయి 59వేల 100 డాలర్ల వద్దకు చేరింది. గత అక్టోబర్ లో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి లక్షా 26వేల డాలర్లతో పోలిస్తే బిట్‌కాయిన్ ఏకంగా సగానికి పైగా విలువను కోల్పోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఊపందుకున్న క్రిప్టో మార్కెట్, ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 2024 నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది.

అసలు ఎందుకు పడిపోతోంది?

క్రిప్టో మార్కెట్ పతనానికి నిపుణులు ప్రధానంగా ఈ క్రింది కారణాలను చెప్తున్నారు:
1. AI వైపు పెట్టుబడుల మళ్లింపు: ఇన్వెస్టర్లు క్రిప్టోల నుంచి లాభాలను స్వీకరించి, ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న AI, డిఫెన్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.

2. ETF ల నుండి నిధులు బయటకు: గతంలో బిట్‌కాయిన్ పెరగడానికి కారణమైన స్పాట్ బిట్‌కాయిన్ ఇటీఎఫ్‌ల నుండి నిధులు భారీగా వెనక్కి వెళ్తున్నాయి. మే మధ్యలో 107.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇటీఎఫ్‌ల నికర ఆస్తుల విలువ ఇప్పుడు 80.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

3. మైఖేల్ సేలర్ సంస్థ ప్రభావం: బిట్‌కాయిన్‌ను భారీగా హోల్డ్ చేసే మైఖేల్ సేలర్ సంస్థ (గతంలో మైక్రోస్ట్రాటజీ), తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేయటం మార్కెట్‌లో ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది.

4. వడ్డీ రేట్ల మార్పు అంచనాలు: అమెరికాలో ఉద్యోగాల డేటా బలంగా రావడంతో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు తగ్గాయి. బాండ్ ఈల్డ్స్, డాలర్ పుంజుకోవడంతో క్రిప్టో లాంటి రిస్క్ ఎసెట్స్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి తగ్గించుకున్నారు.

కీలకమైన సపోర్ట్ జోన్ ఇదే..
రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్‌కు 60వేలు - 62వేల డాలర్ల జోన్ అత్యంత కీలకమైన సపోర్ట్ కానుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ తిరిగి కోలుకోవాలంటే ETF లలోకి నిధుల రాక పెరగడం.. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు సానుకూలంగా మారడం అవసరం. భవిష్యత్తులో క్రిప్టోలపై రెగ్యులేటరీ క్లారిటీ, స్టేబుల్‌కాయిన్ ఇన్నోవేషన్స్ ద్వారానే క్రిప్టో మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని కాయిన్‌డీసీఎక్స్ సహ వ్యవస్థాపకులు సుమిత్ గుప్తా అన్నారు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
ఇలాంటి మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో ఇన్వెస్టర్లు ఆందోళనతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ అస్థిరతను తట్టుకోవడానికి SIP విధానం, సరైన పోర్ట్‌ఫోలియో అలోకేషన్ ఉత్తమమైన మార్గాలని సూచిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కేవలం 2% నుండి 5% మాత్రమే క్రిప్టోలకు కేటాయించాలని, మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు సైతం గరిష్టంగా 10% లోపే పెట్టుబడులను ఉంచుకోవడం సేఫ్ అంటున్నారు. లాంట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూసేవారు మార్కెట్లో బలంగా ఉండే బిట్‌కాయిన్ వంటి ప్రధాన క్రిప్టో అసెట్స్‌పైనే దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.