రికార్డ్ నష్టాల నుంచి క్రిప్టో కరెన్సీలు రివర్స్.. చైనా టారిఫ్స్ భయాల నుంచి బయటకు ట్రేడర్స్..

రికార్డ్ నష్టాల నుంచి క్రిప్టో కరెన్సీలు రివర్స్.. చైనా టారిఫ్స్ భయాల నుంచి బయటకు ట్రేడర్స్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాతో వాణిజ్య సంబంధాలపై ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సంకేతాలు ఇవ్వడంతో.. గతవారం చివర్లో భారీ పతనాన్ని చూసిన క్రిప్టోకరెన్సీలు తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతో వారాంతంలో ఎదురైన భారీ నష్టాల నుంచి సోమవారం గణనీయంగా కోలుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువ 6% పైగా పెరిగి 4 ట్రిలియన్ డాలర్లను దాటిందని కాయిన్‌గెకో చెబుతోంది. బిట్‌కాయిన్ సోమవారం ఉదయం లండన్‌లో సుమారు లక్ష 15వేల డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. శుక్రవారం అమెరికాలో లక్ష 05వేల డాలర్లకు దిగజారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో ఫేమస్ క్రిప్టో కరెన్సీ ఈథర్ కూడా 3,500 డాలర్ల కంటే తక్కువ స్థాయి నుంచి తిరిగి పుంజుకుని 4,100 డాలర్ల వరకు తిరిగి పెరిగింది. ఆదివారం యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చైనాతో ఒప్పందం సాధ్యమనే సంకేతాలను ఇచ్చిన తర్వాత పెరుగుదల కనిపించింది. దీనికి ముందు ట్రంప్ శుక్రవారం ప్రకటించిన కొత్త చైనా సుంకాల కారణంగా 19 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో పెట్టుబడులు చెరిగిపోయాయి. 

వాస్తవానికి గతవారం చివర్లో ఆటోమేటిక్ లిక్విడేషన్‌లు, అధిక లివరేజ్, గ్లోబల్ మార్కెట్లలో తక్కువ లిక్విడిటీ కారణంగా నష్టాలు భారీగా పెరిగాయి. ట్రంప్ మాటలతో పెద్ద క్రిప్టోలకు రిలీఫ్ వచ్చినప్పటికీ.. చిన్న టోకెన్లు ఇంకా అక్టోబర్ 9 స్థాయికి చాలా దిగువనే కొనసాగుతున్నట్లు DACM సహ వ్యవస్థాపకుడు రిచర్డ్ గాల్విన్ చెబుతున్నారు. దీని ప్రకారం రిస్క్ ఇప్పటికీ ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు. క్రిప్టోల పతనం సమయంలో Ethena USDe అనే మూడవ అతిపెద్ద స్టేబుల్‌కాయిన్ తాత్కాలికంగా డాలర్ పెగ్ కోల్పోయింది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినేన్స్ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. 

లివరేజ్ కోసం ఫ్యూచర్స్‌లో బుల్లిష్ బెట్టింగ్ చేసే ట్రేడర్లు చెల్లించే వడ్డీ.. 2022లో FTX కుప్పకూలినప్పటి నుండి అతి తక్కువస్థాయికి పడిపోయాయి. బిట్‌కాయిన్, ఈథర్ ఆప్షన్లలో ఓపెన్ ఇంటరెస్ట్ సగానికి తగ్గి వరుసగా 33 బిలియన్ డాలర్లు, 19 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ పతనానికి ముందు అక్టోబర్ 6న బిట్‌కాయిన్ తన జీవితకాల గరిష్ఠమైన లక్ష 26వేల 251 డాలర్ల మార్కును తాకింది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బిట్‌కాయిన్ రేటు దాదాపు 23 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న ప్రోక్రిప్టో విధానాలే ఈ ర్యాలీకి తోడ్పాటు ఇచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.