నా కోడి కాళ్లు విరగ్గొట్టిండు.. కేసు పెట్టండి.. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు వృద్ధురాలి ఫిర్యాదు

నా కోడి కాళ్లు విరగ్గొట్టిండు.. కేసు పెట్టండి.. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు వృద్ధురాలి ఫిర్యాదు

నకిరేకల్, వెలుగు: ‘ఓ వ్యక్తి నా కోడి కాళ్లు విరగ్గొట్టిండు.. అతడిపై కేసు పెట్టండి’ అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా తీర్చాలో తెలియక పోలీసులు తికమకపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు ఓ కోడిని పెంచుకుంటోంది. ఆ కోడి గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి సంబంధించిన గడ్డివాము వద్ద గింజలు తినేది. ఆగ్రహానికి గురైన రాకేశ్‌‌‌‌‌‌‌‌ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి.

దీంతో గంగమ్మ బుధవారం రాత్రి బోరున విలపిస్తూ నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. తన కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. దీంతో ‘ఈ చిన్న విషయానికి కేసు ఎందుకు.. కోడి రేటు ఎంతో చెబితే రాకేశ్‌‌‌‌‌‌‌‌తో ఇప్పిస్తాం’ అని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వృద్ధురాలు వినిపించుకోకపోగా.. ‘నాకు డబ్బులు వద్దు.. ఏమీ వద్దు.. రాకేశ్‌‌‌‌‌‌‌‌కు శిక్ష పడాల్సిందే.. నా కోడికి జరిగినట్లు ఊళ్లో మరే కోడికి జరగకూడదు’ అని గంగమ్మ పట్టుబట్టింది. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పి ఇంటికి పంపించారు.