ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఫెయిల్.. 80 శాతం కొన్నామని అబద్ధాలు చెప్తున్రు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఫెయిల్.. 80 శాతం కొన్నామని అబద్ధాలు చెప్తున్రు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

నిర్మల్, వెలుగు: పంటల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తప్పుడు లెక్కలతో సర్కారు రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ చేపట్టిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్, మామడ, దిలావర్‌‌‌‌పూర్, నర్సాపూర్, సారంగాపూర్ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పార్టీ నేతలు పరిశీలించారు. 

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా మహేశ్వర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాల్సిన సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 80 శాతం కొనుగోళ్లు జరిగాయని చెబుతున్నా, వాస్తవానికి 50 శాతం కూడా పూర్తికాలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు జైళ్లలా మారాయని విమర్శించారు. సీఎం, మంత్రులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడాలని సూచించారు.

  • పాలన చేతగాకపోతే దిగిపో..

సారంగాపూర్‌‌‌‌లో జరిగిన ముగింపు సభలో మహేశ్వర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్​ చేశారు. రేవంత్​రెడ్డి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్‌‌‌‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్​రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, హరీశ్‌‌‌‌కుమార్, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.