ఆ రెండు సెగ్మెంట్లు మస్ట్.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ.. ?

ఆ రెండు సెగ్మెంట్లు మస్ట్.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ.. ?

= కూకట్ పల్లి, శేరిలింగంపల్లిపై జనసేన కన్ను
= బీజేపీని 20 స్థానాలు అడుగుతున్న జనసేన
= 6–10 సెగ్మెంట్లు  కేటాయించే అవకాశం
= త్వరలో అమిత్​ షాతో పవన్ కల్యాణ్ భేటీ?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా 20 సీట్లు తమకు కేటాయించాలని జనసేన పార్టీ కోరుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి స్థానాలను పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించాలని జనసేన పట్టుబడుతోందని సమాచారం. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు స్థానాలపై గురి పెట్టినట్టు తెలుస్తోంది.  బీజేపీ మాత్రం 6 నుంచి 10 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు జనసేన గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మొదటి జాబితా విడుదలకు ముందు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్​ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి చర్చించారు. ప్రధానంగా సీట్ల కేటాయింపు అంశంపైనే ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగాయి.  సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు​ చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళ్తారా..? 27న రాష్ట్రంలో అమిత్ షా పర్యటన ఉన్నందున ఇక్కడే చర్చిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. చర్చల తర్వాతే గ్లాస్ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది తేలనుంది. పొత్తులపై సర్దుబాట్ల తర్వాత బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.