జనసేనకు10 సీట్లు!..బీజేపీతో పొత్తు కొలిక్కి

జనసేనకు10 సీట్లు!..బీజేపీతో పొత్తు కొలిక్కి
  •     గ్రేటర్​లో కూకట్ పల్లి కేటాయింపు. .  ఇక్కడే మరో సీటు ఇచ్చే చాన్స్  
  •     పవన్ కల్యాణ్​తో కిషన్​రెడ్డి, లక్ష్మణ్ చర్చలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. శనివారం రాత్రి జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్ ​ఇంటికెళ్లి పొత్తులపై బీజేపీ స్టేట్ ​చీఫ్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ చర్చించారు. 32 సీట్లు ఇవ్వాలని పవన్​ కోరగా, 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో సీటు ఇవ్వాలని పవన్​ కోరగా అంగీకరించినట్టు సమాచారం. కూకట్​పల్లి, మెదక్, తాండూరు, నాగర్​కర్నూల్, కోదాడ, అశ్వారావుపేట, వైరాతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మరో సీటు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరో రెండు సీట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. సమావేశం అనంతరం పవన్, కిషన్​రెడ్డి, లక్ష్మణ్ ​మీడియాతో మాట్లాడారు. 

32 సీట్లు అడిగినం: పవన్ ​

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లలో తాము పోటీ చేయాలని భావించామని పవన్​కల్యాణ్ ​తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా బీజేపీతో చర్చలు జరిపామని, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చాయన్నారు. రెండు సీట్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని, దీనిపై తమ పార్టీ పీఏసీ చైర్మన్​ నాదెండ్ల మనోహర్​ ఆధ్వర్యంలో మరోసారి చర్చిస్తారని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 7న హైదరాబాద్​లో నిర్వహించే ప్రధాని సభలో పాల్గొంటానన్నారు. కాగా, పవన్​తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన నేత శంకర్​ గౌడ్ ​తెలిపారు. తెలంగాణలోనూ వారాహి యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది: కిషన్​రెడ్డి

జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని కిషన్​రెడ్డి తెలిపారు. రెండు సీట్లపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని, రాష్ట్రంలో డబుల్​ఇంజన్​సర్కార్​రావాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి సహకరించిందని తెలిపారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభకు పవన్​ను ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. జనసేన మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఎంపీ లక్ష్మణ్​తెలిపారు. తెలంగాణలో డబుల్​ఇంజన్​సర్కార్​రావాల్సి ఉందని, దేశానికి మూడోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. తమతో కలిసి పనిచేసేందుకు పవన్​సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు.