
నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ, ఏబీవీపీ నేతలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జిల్లా ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బీజేపీ, ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు.
భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కుటుంబసభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. మరోవైపు భాను ప్రసాద్ ఉరి వేసుకున్న గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులుకారని, మానసిక సమస్యే తన నిర్ణయానికి కారణమని అందులో రాశాడు. భాను ప్రసాద్ సూసైడ్ లెటర్ లో చెప్పిన వ్యాఖ్యలపై అతని కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. మూడునాల్రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకున్నా..క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.