
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయంలో వలలో చిక్కి ఓ పాము విలవిలలాడింది. బయటికొచ్చే దారి లేక వలలో చిక్కుకుని నడి ఎండలో నీరసించి దాహార్తితో అలమటించి బుసలు కొడ్తున్న సర్పాన్ని చూసి జనం జాలిపడ్డారు.
‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’కి సమాచారమివ్వడంతో.. వారొచ్చి రెస్క్యూ చేసి వలను కత్తిరించి నీళ్లు తాగించి సర్పానికి దాహం తీర్చారు. మంచిరేవులలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం గోశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆదివారం మిట్ట మధ్యాహ్నం వేళ బుసలు కొడ్తున్న ఓ పాము శ్రీ వేణుగోపాలస్వామి గోశాల వద్దకు వచ్చింది. అక్కడున్న వలలోకి దూరి ఎంతకీ బయటకు రాలేక ఎండకు నీరసించిపోయింది.
మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయంలో వలలో చిక్కి విలవిలలాడిన పాము.. కాపాడిన ‘‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’’#Rangareddy #Manchirevula #Snake #Snakevideo #viralvideo pic.twitter.com/X7eajsYrP3
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) May 18, 2025
ఆ పాముని గమనించిన జనం చూసి జాలిపడ్డారు. పామును కాపాడేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకు సమాచారమిచ్చారు. వలను కత్తిరించి పాముని బయటకు తీసి నీటిలో ముంచారు. ఎండదెబ్బతో పాటు దప్పికతో నీరసించి ఉందని.. ఇది ర్యాట్ స్నేక్ అని చెప్పారు. విషపూరితం కానిది ఈ పాము అని.. ఈ పాముకు విషం ఉండదని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు చెప్పారు. ఈ పాముని అటవీ ప్రాంతంలో వదిలి పెడ్తామని.. పాముల్ని చంపొద్దని.. జీవ వైవిధ్యంలో భాగంగా పాముల్ని బతికించుకోవాలన్నారు.