IMF News: ఫలించిన భారత చర్యలు.. రుణంపై పాక్‌కి 11 షరతులు పెట్టిన ఐఎంఎఫ్

IMF News: ఫలించిన భారత చర్యలు.. రుణంపై పాక్‌కి 11 షరతులు పెట్టిన ఐఎంఎఫ్

Pakistan News: పాక్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిధుల కోసం అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్ తో పాటు మరిన్ని మిత్ర దేశాల నుంచి అడుక్కుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఉగ్రవాదానికి చేసిన ఖర్చు ఆ దేశం ప్రగతిని సాధించేందుకు వాడి ఉంటే బాగుండేదని వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంత బెయిల్ ఔట్ అందుకున్న పాక్ పై మరిన్ని నిధుల విడుదలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రకటించింది.

వాస్తవానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించటానికి పాక్ ఆ నిధులను దుర్వినియోగం చేస్తుందంటూ భారత్ అడ్డు చెప్పినప్పటికీ అమెరికా అండతో పాక్ రుణాన్ని పొందగలిగిందని తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతదేశ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ఐఎంఎఫ్ ఇకపై రుణాన్ని రిలీజ్ చేయాలంటే కొత్తగా 11 నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. 

కొత్త నిబంధనలను పరిశీలిస్తే.. ఎలక్ట్రిసిటీ బిల్లుపై అధిక సర్ ఛార్జ్ విధించాలని నిర్ణయించింది. మూడేళ్ల కంటే పాత కార్ల దిగుమతులపై ఆంక్షలను తొలగించాలని సూచించింది. అలాగే ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా లేక ముదిరినా పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించింది. ఇదే క్రమంలో పాకిస్థాన్ డిఫెన్స్ బడ్జెట్ కోసం 2.414 ట్రిలియన్ రూపాయలను అనుమతించగా.. పాక్ మరింత పెంపులను కోరింది.

పాక్ ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను వసూళ్లకు ఏర్పాట్లు చేయాలని ఐఎంఎఫ్ సూచించింది. ఏకంగా విద్యుత్ రంగంలో 4 నిబంధనలను తీసుకొచ్చినట్లు వెల్లడైంది. పాక్ తన విద్యుత్ ఛార్జీలపై విధించిన యూనిట్ ధర రూ.3.21ను తొలగించాలని పేర్కొంది. అలాగే గ్యాస్ పై కూడా సుంకాలను పెంచాలని పాక్ ప్రభుత్వానికి రుణదాత సూచన చేసింది.

పాకిస్తాన్ విద్యుత్ రంగంలో నిరంతరం అప్పులు పెరగడానికి లోపభూయిష్ట ఇంధన విధానాలతో పాటు ప్రభుత్వ పనితీరు కారణమని ఐఎంఎఫ్,  ప్రపంచ బ్యాంకు పదే పదే ఆరోపించాయి. దీనికి తోడు 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్స్, పారిశ్రామిక పార్కులకు ప్రోత్సాహకాలను దశలవారీగా తొలగించడానికి ప్రభుత్వం ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుందని రుణ సంస్థ పేర్కొంది.